Dhirendra Shastri : ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన తనకు సోదర సమానులని ఆధ్యాత్మికవేత్త (Spiritual leader) ధీరేంద్ర శాస్త్రి (Dhirendra Shastri) అన్నారు. దేశానికి ఆయన లాంటి ప్రధాని దొరకడం కష్టమని వ్యాఖ్యానించారు. ఓ జాతీయ మీడియా (National Media) సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోదీ ఎప్పుడూ దేశం గురించే ఆలోచిస్తుంటారు కాబట్టి తాను ఈ మాట అంటున్నానని ధీరేంద్ర చెప్పారు. మిషన్ 2047 అనే ఆయన విజన్ చాలా గొప్పదని పొగిడారు. శత్రుదేశంలోకి వెళ్లి శత్రువులను మట్టుబెట్టడం అద్భుతం అంటూ ఆయన మెచ్చుకున్నారు.
ప్రధాని మోదీ రాముడి గురించి మాట్లాడుతారూ.. రాజ్యం గురించి మాట్లాడుతారని, ఖేల్ గురించి మాట్లాడుతారూ.. రైల్ గురించి మాట్లాడుతారని, చాయ్ గురించి మాట్లాడుతారూ.. గాయ్ గురించి మాట్లాడుతారని ప్రధానిని ధీరేంద్ర ఏకంగా ఆకాశానికెత్తారు.
రాజకీయ పార్టీలకు, ఆధ్యాత్మికవేత్తలకు మధ్య సంబంధంపై కూడా ధీరేంద్ర మాట్లాడారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ హిందూత్వ కాంట్రాక్ట్ తీసుకోలేదని చమత్కరించారు. మాకు ఏ పార్టీతో సాన్నిహిత్యం ఉండదని, అన్ని పార్టీల్లో హిందువులే ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలు తమవేనని అన్నారు.
తనకు కాంగ్రెస్ పార్టీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని ధీరేంద్ర తెలిపారు. కాంగ్రెస్ నేత కమల్నాథ్ చింద్వారాలో తనతో ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించారని గుర్తుచేశారు. దిగ్విజయ్ సింగ్తో కూడా తనకు మంచి సంబంధాలే ఉన్నాయని చెప్పారు.