న్యూఢిల్లీ: నేపాల్ ఆకస్మిక వరదల(Nepal Floods)పై ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ ప్రాథమిక అంచనా వేసింది. త్రిశూలీ నది సమీపంలో ఉన్న మంచు కొండలో జరిగిన మార్పులకు చెందిన చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. నేపాల్-బోర్డర్ సమీపంలో ఉన్న ఆ కొండ నుంచి దిగువకు భారీ వరద ప్రవహించింది. ఎన్ఆర్ఎస్సీ షేర్ చేసిన ఫోటోల్లో.. మంచు కొండపై జరిగిన మార్పులు స్పష్టంగా ఉన్నాయి. వరదకు ముందు, వరదకు తర్వాత జరిగిన మార్పులను ఆ ఫోటోల్లో చూపించారు. అయితే వరద తర్వాత తీసిన ఫోటోలో గ్రే కలర్ ప్యాచ్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీని ద్వారా ఆ ప్రాంతంలో భారీగా మార్పు జరిగినట్లు అంచనా వేశారు.
మంచు ఫలకం విరిగిపడడం లేదా కొండచరియలు విరిగిపడడం వల్ల ఆకస్మిక వరదలు సంభవించినట్లు ఎన్ఆర్ఎస్సీ పేర్కొన్నది. కొండచరియలు విరిగిపడిన తర్వాత .. తాత్కాలికంగా నదిలో బ్లాకేజీ ఏర్పడిందని, అయితే ఒక్కసారిగా ఆ నీరు ఉప్పొంగిందని, దీనితోపాటు రాళ్లు కూడా కొట్టుకు వచ్చినట్లు భావిస్తున్నారు. భారీ స్థాయిలో బురద వరద రావడంతో త్రిశూలీ నదిలో ఆకస్మిక వరదలు వచ్చినట్లు ఎన్ఆర్ఎస్సీ పేర్కొన్నది.
ఇస్రోకు చెందిన రిసోర్స్‌శాట్-2ఏ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ద్వారా ఆగస్టు 26వ తేదీన విరిగిపడిన కొండచరియల ఇమేజ్‌లను క్యాప్చర్ చేశారు. రీసోర్స్శాట్ శాటిలైట్‌ను 2016 డిసెంబర్లో పీఎస్ఎల్వీ ద్వారా లాంచ్ చేశారు. 817 కిలోమీటరల్ పోలార్ సన్ సింక్రోనస్ కక్ష్యలో ఆ శాటిలైట్ ఆపరేట్ అవుతోంది. ఆ ఉపగ్రహం ద్వారా భూమిపై ఉన్న సహజ వనరులను మానిటర్ చేస్తుంటారు. టిబెట్ నుంచి త్రిశూలీ నది పారుతుంది. కిరాంగ్ సాంగ్పో, లెండే ఖోలా నదుల కలయికతో త్రిశూలీ ఉద్భవించింది. సెంట్రల్ నేపాల్‌లో ఉన్న నారాయణి నదీ వ్యవస్థకు ఇది ప్రధాన ఉపనదిగా ఉన్నది. వైట్ వాటర్ రాఫ్టింగ్‌కు త్రిశూలీ నది పాపులర్. ఇక నేపాల్‌లో ఉద్భవించిన నదులన్నీ భారత్‌లోని గంగానదిలో కలుస్తాయి.