Araghchi : ఇరాన్ (Iran) విదేశాంగ మంత్రి (Foreign Minister) అబ్బాస్ అరాగ్చీ (Abbas Araghchi) ఈ నెల 8న భారత పర్యటనకు రానున్నారు. భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం సోమవారం ఈ విషయాన్ని ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే వస్తూవస్తూ ఆయన మార్గ మధ్యలో పాకిస్థాన్‌లో దిగనున్నారు. పాకిస్థాన్ అధికారులతో సమావేశం కానున్నారు.
భారత పర్యటన సందర్భంగా జరిగే జాయింట్ ఎకనామిక్ కమిషన్ సమావేశంలో ఇరుదేశాల దౌత్యాధికారులు పాల్గొననున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక అంశాలతోపాటు, పహల్గాం ఉగ్రదాడిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. ఇదిలావుంటే ఏప్రిల్ 25న ఇరాన్ విదేశాంగ మంత్రి తన ఎక్స్ ఖాతాలో భారత్, పాకిస్థాన్ దేశాలను ఉద్దేశించి ఓ సందేశం పంపించారు.
భారత్, పాకిస్థాన్ దేశాలు రెండూ తమకు తొలి ప్రాధాన్యమని అరాగ్చీ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన ఈ సందేశం పంపారు. గత నెల 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 25 మంది భారతీయులు కాగా, మరొకరు నేపాల్‌కు చెందిన వ్యక్తి ఉన్నారు.