ముదురుతున్న యుద్ధం.. ఇంటర్నెట్కు కష్టం!
సముద్రగర్భంలోని కేబుళ్లు కట్ చేస్తామని ఇరాన్ హెచ్చరిక.. అదే జరిగితే భారత్‌పైనా ప్రభావం.
- యూపీఐ, వాట్సాప్ సహా పలు సేవలు నెమ్మదించే అవకాశం
న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ – అమెరికా యుద్ధం ప్రభావం ఇప్పటికే అంతర్జాతీయంగా ఇంధన ధరలపై పడింది. పరిస్థితి మరింత ముదిరితే మున్ముందు భారత్ సహా ప్రపంచంలోని పలు దేశాల్లో ఇంటర్నెట్ సేవలపైనా ప్రభావం పడే ప్రమాదం కనిపిస్తున్నది. ఇరాన్, అమెరికా మధ్య ఒప్పందం కుదరకపోతే మరోసారి సైనిక దాడులు చేపట్టవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు.
అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేస్తే గల్ఫ్ ప్రాంతంలోని సముద్రగర్భ కమ్యూనికేషన్ కేబుళ్లను లక్ష్యంగా చేసుకుంటామంటూ ఇరాన్ ప్రతిస్పందించింది. ప్రపంచ అంతర్జాతీయ డాటా ట్రాఫిక్‌లో సుమారు 95 నుంచి 99 శాతం వరకు సముద్రగర్భ కేబుళ్ల ద్వారానే ప్రసారమవుతుంటుంది. హొర్ముజ్ జలసంధి ప్రపంచ వాణిజ్యానికి ఎంత ముఖ్యమో.. అంతర్జాతీయ కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా అంతే కీలకమైనది. ఈ ప్రాంతంలోని సముద్రగర్భ కేబుళ్లు ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల మధ్య ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తాయి.
ఈ కేబుళ్ల ద్వారా భారీ మొత్తంలో డాటా ఒక దేశం నుంచి మరో దేశానికి చేరుతుంది. ఇరాన్ ఈ కేబుళ్లను ధ్వంసం చేస్తే భారత్‌లోని పలు డిజిటల్ సేవలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉన్నది. బ్యాంకులు, చెల్లింపు వ్యవస్థల సర్వర్లతో కనెక్షన్ దెబ్బతింటే కొన్ని లావాదేవీలు విఫలమవ్వవచ్చు లేదా ఆలస్యమవ్వవచ్చు. వాట్సప్ సందేశాలు పంపడం, స్వీకరించడం, వాయిస్, వీడియో కాల్స్ చేయడంలో సమస్యలు తలెత్తవచ్చు. యూట్యూబ్ వీడియోలు లోడ్ కావడం నెమ్మదించవచ్చు లేదా స్ట్రీమింగ్‌లో అంతరాయాలు రావచ్చు.
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్ లోడ్ కావడం నెమ్మదించవచ్చు. విదేశీ సర్వర్ల ద్వారా పనిచేసే కొన్ని ఏఐ అప్లికేషన్లు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నది. అయితే భారత్‌లో యూపీఐ, వాట్సప్ సహా అన్ని సేవలు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పలేం. భారత్‌కు అనేక అంతర్జాతీయ సముద్రగర్భ కేబుళ్లు, ప్రత్యామ్నాయ నెట్వర్క్ మార్గాలు ఉన్నాయి. ప్రభావం కేబుళ్ల నష్టం ఎంత విస్తృతంగా ఉన్నది, ఏ మార్గాలు దెబ్బతిన్నాయి, ప్రత్యామ్నాయ మార్గాల సామర్థ్యం ఎంత అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి లేదా కొన్ని కేబుళ్లు దెబ్బతింటే మిగిలిన కేబుళ్ల ద్వారా డాటాను మళ్లించే అవకాశం ఉంటుంది. కానీ ఒకే కీలక ప్రాంతంలో అనేక కేబుళ్లు ఒకేసారి దెబ్బతింటే పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

