మొరాదాబాద్ (యూపీ), సెప్టెంబర్ 22: అప్పటికే ఐదుగురు కలిసి లైంగిక దాడి చేస్తే సగం కుంగిపోయిందా బాలిక.. బట్టలు కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో పాలుపోక, ఇంటికి బయల్దేరింది.. ఒంటి మీద నూలు పోగు లేదు, అక్కడక్కడా రక్తపు మరకలు, కండ్ల నిండా నీళ్లు.. పట్టపగలు, నడిరోడ్డుపై 2 కిలోమీటర్ల పాటు నడిచి వెళ్తున్నా, అయ్యో పాపం! అన్నవారు లేరు.. కనీస ఇంగితజ్ఞానం లేని కొందరు దుర్మార్గులు ఆమె వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ అమానవీయ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో 15 రోజుల క్రితం చోటుచేసుకొన్నది. వివరాల్లోకెళితే.. పదిహేనేండ్ల బాలిక పని మీద పక్క గ్రామానికి వెళ్లగా ఐదుగురు వ్యక్తులు ఆమెను అపహరించారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేసి లైంగికదాడికి పాల్పడ్డారు.
అనంతరం బాలిక దుస్తులు, ఇతర వస్తువులతో ఉడాయించారు. ఆమె ఏడుస్తూ కాసేపు అలాగే కూర్చున్నది. చివరికి ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఇంటికి బయలుదేరింది. ఒంటిపై దుస్తులు లేకుండా మొరాదాబాద్-ఠాకూర్దారా రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఆ బాలికను చూసినవాళ్లు కనీసం సాయం చేయడానికి కూడా ముందుకు రాలేదు. కొంతమంది వీడియోలు తీసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు. దాదాపు రెండు కిలోమీటర్లు అలాగే నడుచుకుంటూ ఇంటికి చేరిన బాలిక జరిగిన విషయాన్ని కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో బంధువు ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాక అప్పుడు కేసు నమోదు చేసి నిందితుల్లో ఒకడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అసలు ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలు ఉన్నాయా? అక్కడ ఆడబిడ్డలకు రక్షణ ఎండమావేనా? పోలీసులు ఏం చేస్తున్నారు? అని నిలదీస్తున్నారు.