Indigo Row | దేశవ్యాప్తంగా ఇండిగో సేవలు స్తంభించాయి. సాంకేతిక సమస్యల కారణంగా సేవలు భారీగా ప్రభావితమయ్యాయి. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు సహా పలు నగరాల్లో దాదాపు 300పైగా విమారాలు రద్దయ్యాయి. ఇండిగో విమానాల ఆలస్యం, రద్దు కారణంగా పుణే విమానాశ్రయంలో పరిస్థితి మరింత దిగజారింది. ప్రయాణికుడు సతీశ్ కాలే మాట్లాడుతూ.. తాము ప్రయాణించాల్సిన విమానం ఉదయం 7 గంటలకు షెడ్యూల్ అయ్యింది. విమానం ఆలస్యంగా నడుస్తుందని కానీ, రద్దు చేసినట్లుగా కానీ తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే వరకు.. విమానాశ్రయం పూర్తిగా నిండిపోయిందని.. ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం ఇవ్వాలన్నారు. ఎయిర్‌లైన్స్ సైలెన్స్ స్ట్రయిక్ చేస్తోందని ప్రయాణికుడు మండిపడ్డాడు.
ఏవియేషన్ ఇండస్ట్రీలో తమకు ఇప్పటికే గుత్తాధిపత్యం ఉందని చూపించాలనుకుంటున్నారని.. సిబ్బంది లేరని ఇండిగో చెబుతోందని మరో ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముగ్గురు ప్రయాణికులు స్పృహ కోల్పోయారని.. ప్రభుత్వం ఇండిగోకు ప్రత్యామ్నాయం వెతకాలని సూచించారు. ఎయిర్‌బస్‌లో సాఫ్ట్వేర్ అప్డేట్ కారణంగా సమస్యలు వస్తున్నాయని ముంబయికి చెందిన ప్రయాణికుడు సంజయ్ తెలిపారు. రెండు రోజులుగా విమానాలు నిలిచిపోయాయని.. దాంతో కనెక్టింగ్ ఫ్లయిట్‌ను సైతం మిస్ అయినట్లు చెప్పాడు. ఎయిర్‌లైన్, మంత్రిత్వశాఖ సైతం సహాయం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జుమ్మన్ అలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడు చనిపోయాడని.. టికెట్ ధరలు రూ.36వేల నుంచి రూ.46వేలకు పెరిగాయని.. అయినప్పటికీ ఇప్పటికీ విమానాలు అందుబాటులేవని వాపోయాడు.
తన తల్లిదండ్రులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయారని చెప్పాడు. జమ్మూ నుంచి ఢిల్లీకి వెళ్లే విమానం నాలుగు గంటలకుపైగా ఆలస్యంగా నడుస్తుందని సమాచారం ఇచ్చారని.. ఈ విమానం ఎప్పుడు బయలుదేరుతుందో తమకు తెలియదని ఓ ప్రయాణికుడు చెప్పాడు. తొలుత విమానం 10.30 గంటలకు షెడ్యూల్ చేశారని.. మళ్లీ ఢిల్లీ విమానం 15.30 గంటలకు తిరిగి షెడ్యూల్ చేశారని ప్రయాణికుడు చెప్పుకొచ్చాడు. చెన్నైలో కూడా భారీగా విమానాలు ప్రభావితమయ్యాయి. తాను ఇండిగో సేవలతో విసిగిపోయానని.. నిన్న ముంబయి నుంచి కోల్‌కతాకు వెళ్లాల్సిన విమానం రద్దయ్యిందని.. ఆ తర్వాత చెన్నైకి మళ్లించారని.. అక్కడికి చేరుకున్నాక విమానం రద్దయ్యిందని ఓ ప్రయాణికుడు వాపోయాడు. పోర్ట్ బ్లెయిర్ నుంచి కోల్‌కతాకు వెళ్లే విమానం కూడా రద్దయ్యిందని.. విమానాలు ఆలస్యం, రద్దు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విమాన కార్యకలాపాలు ఎప్పుడు సాధారణ స్థితికి చేరుకుంటాయో స్పష్టమైన సమాచారం లేదు.