అహ్మదాబాద్: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాలు రద్దు, ఆలస్యం, అంతరాయాల వల్ల వందలాది మంది ప్రయాణికులు మూడు, నాలుగు రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో కొందరివి దయనీయ గాథలు. అహ్మదాబాద్‌కు చెందిన మహర్షి జాని అనే ప్రయాణికురాలు కన్నీళ్లు ఉబికి వస్తుండగా మాట్లాడుతూ, తాము స్మార్ట్ ఇండియా హ్యాకథాన్, 2025కి ఎంపికయ్యామని చెప్పారు. మొత్తం 74,000 ఐడియాలను సమర్పించారని, వీటిలో 1,400 ఐడియాలు ఎంపికయ్యాయని తెలిపారు. అరుదైన ఈ అవకాశం కోసం 6-7 నెలల నుంచి దీని కోసం శ్రమించి కృషి చేస్తున్నామన్నారు.
తాము తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నామని చెప్పారు. మరో ప్రయాణికుడు ఇక్లక్ హుస్సేన్ మాట్లాడుతూ, తాను జెడ్డా నుంచి అహ్మదాబాద్ వచ్చానని చెప్పారు. తాను లక్నోకు వెళ్లాల్సి ఉందని తెలిపారు. రెండు రోజుల నుంచి తాను అహ్మదాబాద్‌లోనే చిక్కుకున్నానని పేర్కొన్నారు. భువనేశ్వర్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలు మాట్లాడుతూ, తాను ఈ నెల 5న బెంగళూరు వెళ్లే విమానంలో ప్రయాణించేందుకు టికెట్ బుక్ చేసుకున్నానని.. అయితే ఆ రోజు తనకు కనీసం ఒక సీటును ఇండిగో సిబ్బంది కేటాయించలేదన్నారు. ఇండిగో విమానాల రద్దు ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ వాయిదాకు దారి తీసి 21 లక్షల నష్టం జరిగిందని ఫెన్ట్రెక్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు అమిత్ కుమార్ గుప్తా వివరించారు.