న్యూఢిల్లీ: ఒమిక్రాన్ రకం ( Omicron variant ) కరోనా వేరియంట్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. ఆదివారంలో నలుగురిలో మాత్రమే ఒమిక్రాన్ బయటపడినప్పటికీ అంతకుముందు వరుసగా నాలుగురోజులు పదికిపైగా కేసుల నమోదవుతూ వచ్చాయి. తాజాగా కేసులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 147కు చేరింది. శనివారం 30 మంది, శుక్రవారం 26 మంది, గురువారం 14 మంది, మంగళ, బుధ వారాల్లో 12 మంది చొప్పున ఒమిక్రాన్ బారినపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒమిక్రాన్ విస్తరించింది. మహారాష్ట్ర, ఢిల్లీ వరుసగా 48, 22 కేసులతో ముందు వరుసలో ఉన్నాయి.
కాగా, ఒమిక్రాన్ వేరియంట్ గత నెల 24న ఆఫ్రికా దక్షిణ దేశాల్లో బయటపడింది. ఆ తర్వాత క్రమంగా ఇతర దేశాలకు విస్తరించింది. మన దేశంలో డిసెంబర్ 2న ఒమిక్రాన్ కాలు మోపింది. ఆ రోజు బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్ వేరియంట్ బయటపడింది.