న్యూఢిల్లీ, మార్చి 18: జీవం పుట్టుక గుట్టును విప్పేందుకు భారత శాస్త్రవేత్తలు సముద్రంలో అరు కిలోమీటర్ల లోతుకు వెళ్లి అక్కడి మట్టి, జీవంపై పరిశోధనలు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా డీప్ ఓషన్ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిశోధన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ మిషన్ త్వరలోనే ప్రారంభం కానున్నది. ఖర్చు రూ.4,077 కోట్లు. మిషన్లో భాగంగా తొలుత 500 మీటర్ల లోతువరకు శాస్త్రవేత్తలు వెళ్లి అక్కడి నుంచి అత్యాధునిక సాంకేతికత సాయంతో పరిశోధనలు నిర్వహించాలని భావించారు. తాజాగా ఈ పరిధిని పెంచారు. సముద్రాల అట్టడుగున ఉన్న హైడ్రో థర్మల్ బిలాల నుంచి జీవం పుట్టిందని జీవ శాస్త్రవేత్తల అంచనా. ఇవి సముద్రంలో 5-6 కిలోమీటర్ల లోతులో ఉంటాయి. డీప్ ఓషన్ మిషన్తో జీవంతో పాటు అక్కడ ఉన్న లోహాలు, ఖనిజాలపై కూడా స్పష్టత వస్తుంది. భవిష్యత్తులో వాటిని వెలికితీయవచ్చు.