న్యూఢిల్లీ: సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. అయితే పాకిస్థాన్‌కు మద్దతిచ్చిన టర్కీ, అజర్‌బైజాన్‌పై దేశంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో భారత ట్రావెల్ సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్థాన్‌పై భారత్ చర్యలను వ్యతిరేకించిన ఈ రెండు దేశాలకు టూర్ ప్యాకేజీలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. టర్కీ, అజర్‌బైజాన్‌కు బుకింగ్‌లను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఈజ్‌మైట్రిప్, కాక్స్ అండ్ కింగ్స్, ట్రావోమింట్ ప్రకటించాయి. జాతీయ సెంటిమెంట్‌తోపాటు భద్రత, దౌత్యపరమైన ఇబ్బందుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
కాగా, ఇటీవలి పరిణామాల దృష్ట్యా అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్, టర్కీకి అన్ని కొత్త టూర్ ఆఫర్లను నిలిపివేయాలని నిర్ణయించినట్లు కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ తెలిపారు. దేశ ప్రజల మనోభావాలు తమకు చాలా ముఖ్యమని చెప్పారు. ఈ అనిశ్చిత కాలంలో ప్రయాణికుల భద్రత తమకు చాలా ముఖ్యమని ఈజ్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ నిశాంత్ పిట్టి అన్నారు. టర్కీ, అజర్‌బైజాన్‌ను బహిష్కరించాలన్న భారతీయుల పిలుపు మేరకు ఆ రెండు దేశాలకు టూర్ ప్యాకేజీలను నిలిపివేసినట్లు ట్రావోమింట్ సీఈఓ అలోక్ కె సింగ్ వెల్లడించారు.