భువనేశ్వర్: భారతీయ రైల్వే చరిత్రలో (Indian Railway) అత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని (Odisha) బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి. గత నెల 2న బహనాగ బజార్ రైల్వేస్టేషన్ (Bahanaga Bazar railway station) సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న (Triple train accident) విషయం తెలిసిందే. ఈ ఘటనలో 291 మంది మరణించగా, 1,100 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ నిర్వహిస్తున్న సంగతి విధితమే. కాగా, ప్రమాదం జరిగిన నెల రోజుల తర్వాత సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) జనరల్ మేనేజర్ అర్చనా జోషిపై (Archana Joshi) ప్రభుత్వం వేటువేసింది. ఆమె స్థానంలో కొత్త జీఎంగా అనిల్ కుమార్ మిశ్రాను (Anil Kumar Mishra) క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియమించింది.
SER GM Archana Joshi
ఇప్పటికే ఈ ఘటనలో ఎస్‌ఈఆర్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులపై రైల్వే బోర్డు వేటువేసిన విషయం తెలిసిందే. వారిలో ఖరగ్‌పూర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) శుజాత్ హష్మీ, ఎస్ఈఆర్ జోన్ ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ పీఎం సిక్దర్, ప్రిన్సిపల్ చీఫ్ సేఫ్టీ ఆఫీసర్ చందన్ అధికారి, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ డీబీ కేసర్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఎండీ ఓవైసీ ఉన్నారు.
కాగా, ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మృతదేహాలను భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కు తరలించారు. వాటిలో 81 మృతదేహాలు ఇంకా అక్కడే ఉన్నాయి. మృతదేహాలు తమ వారివే అని పలువురు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించారు. చనిపోయిన వారిని గుర్తించేందుకు ఆయా నమూనాలను డీఎన్ఏ పరీక్ష కోసం ఢిల్లీ పంపారు.
మరోవైపు 29 నమూనాలకు సంబంధించిన డీఎన్ఏ రిపోర్టులు అందినట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ తెలిపారు. దీంతో మృతుల బంధువులకు ఈ సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. గుర్తించిన 29 మృతదేహాల్లో ఐదింటిని వారికి అప్పగించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి ఊర్లకు మృతదేహాల తరలింపు కోసం రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
కాగా, మృతదేహాలను ఊర్లకు తీసుకెళ్లని పక్షంలో బంధువుల విన్నపం మేరకు అంత్యక్రియల కోసం భువనేశ్వరంలోని రెండు ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్లు మేయర్ సులోచనా దాస్ తెలిపారు. మూడు రైళ్ల ప్రమాదంలో మరణించిన 291 మందిలో 52 మృతదేహాలను ఇంకా గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.