న్యూఢిల్లీ : పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించిన హైబ్రిడ్ వీటీఓఎల్ యూఏవీ రుద్రాస్త్ర పరీక్షలు విజయవంతమయ్యాయి. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ (ఎస్‌డీఏఎల్) గురువారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మానవ రహిత గగనతల వాహనం (యూఏవీ) అసాధారణ పనితీరును కనబరచింది. భారత సైన్యం నిర్దేశించిన అన్ని కార్యకలాపాల పరామితులకు అనుగుణంగా పని చేసింది. వెర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటీఓఎల్) సామర్థ్యాలు సహా, లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా ఛేదించడం, మిషన్ ఫ్లెక్సిబిలిటీ వంటి అన్ని అంశాల్లో విజయవంతమైంది.
రన్‌వే అవసరం లేకుండానే నిలువుగా ఎగరగలిగే, భూమిపైకి దిగగలిగే సామర్థ్యాన్నే వీటీఓఎల్ అంటారు. రుద్రాస్త్ర తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించిన తర్వాత తాను ప్రారంభమైన చోటుకు తిరిగి సురక్షితంగా వచ్చింది. లక్షిత ప్రాంతంలో సంచరించే సామర్థ్యం సహా మొత్తం పరిధి 170 కి.మీ. దాటింది. ఇది సుమారు 1.5 గంటలపాటు ఆకాశంలో ఎగరగలదని అంచనా. ప్రెసిషన్ గైడెడ్ యాంటీ పెర్సనల్ వార్‌హెడ్‌ను విజయవంతంగా మోహరించడం ఈ పరీక్షలో చెప్పుకోదగ్గ ముఖ్యాంశం.