Brahmaputra Project | న్యూఢిల్లీ, జనవరి 4: బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ డ్యామ్‌ను నిర్మిస్తామని చైనా చెప్తున్నది. పర్యావరణపరంగా ఎంతో సున్నితమైన టిబెట్‌లోని హిమాలయన్ జోన్లో భారత సరిహద్దుకు అత్యంత సమీపాన నిర్మించనున్న ఈ ఆనకట్ట ఇప్పటికే సెంట్రల్ చైనాలోని యాంగ్జీ నదిపై నిర్మించిన త్రీగోర్జెస్ డ్యామ్ కంటే పెద్దగా ఉంటుందని ప్రకటించింది.
దీంతో శుక్రవారం చైనాకు భారత్ ఓ గుర్తింపు నోట్(రిమైండర్) పంపింది. బ్రహ్మపుత్ర నది విషయంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకుంటుందని ఆ రిమైండర్లో స్పష్టం చేసింది. ఈ నదీ జలాలపై భారత్‌కు ఉన్న హక్కులను పునరుద్ఘాటించడంతోపాటు ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చైనా పారదర్శకంగా వ్యవహరించాలని కోరింది. పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు గమనిస్తుందని, అవసరమైనప్పుడు తగిన చర్యలు చేపడుతుందని చైనాకు తెలియజేసినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ వెల్లడించారు.