న్యూఢిల్లీ, జూలై 17: అహ్మదాబాద్‌లో గత నెలలో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానానికి చెందిన కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్(బ్లాక్ బాక్స్)లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను బట్టి విమాన ఇంధన సరఫరాను కెప్టెనే కటాఫ్ చేసినట్లు సూచిస్తున్నదని ప్రాథమిక దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలను ఉటంకిస్తూ అమెరికా నుంచి వెలువడే వాల్ స్ట్రీట్ జర్నల్ బుధవారం వార్తా కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. టేకాఫ్ అయిన వెంటనే ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లను కటాఫ్ పొజిషన్‌కి మార్చిన కెప్టెన్‌ని ఎందుకు మార్చావని పైలట్ ప్రశ్నించగా, తాను ఆ పని చేయలేదని కెప్టెన్ బదులిచ్చారు. కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణను భారత్‌కు చెందిన విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో(ఏఏఐబీ) జూలై 12న ఇచ్చిన తన ప్రాథమిక నివేదికలో ధ్రువీకరించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొన్నది. అయితే ఏఏఐబీ నివేదిక ఇద్దరు పైలట్లలో ఎవరినీ పేరు పెట్టి బాధ్యులను చేయలేదు. అయితే విమానాన్ని నడపడంలో పూర్తిగా నిమగ్నమై ఉన్న ఫస్ట్ ఆఫీసర్ అంతటి కీలక సమయంలో చేతులతో ఫ్యూయల్ స్విచ్‌లను కటాఫ్ పొజిషన్‌కి మార్చడంపై దృష్టి సారించలేడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జర్నల్ తెలిపింది.
ఎయిరిండియా విమాన ప్రమాదంపై ఏఏఐబీ ఇచ్చిన ప్రాథమిక నివేదికపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్(ఎఫ్ఐపీ) గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తి కాకుండానే పైలట్లపై నిందలు వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కూలిపోయిన విమానంలోని కాక్‌పిట్ వాయిస్ రికార్డింగ్‌లను పేర్కొంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించిన సమయంలోనే ఎఫ్ఐసీ నుంచి నిరసన వ్యక్తం కావడం గమనార్హం. విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదిక బహిర్గతం కావడంపై ఎఫ్ఐపీ ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తు ప్రక్రియలో పైలట్ల ప్రాతినిధ్యం లేకపోవడం పట్ల పైలట్ల సమాఖ్య అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఎయిరిండియా ప్రమాదంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో విమానం కూలిపోయిన ఘటనపై దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న కారణంగా అప్పుడే నిర్దిష్టమైన నిర్ణయానికి రావద్దని ఏఏఐబీ గురువారం విజ్ఞప్తి చేసింది. అసమగ్ర కథనాలను వ్యాప్తి చేయవద్దని కోరింది. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు వాస్తవాలు నిర్ధారించుకోకుండా పదేపదే వార్తాకథనాలను ప్రచురిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అవి బాధ్యతారహితమైన చర్యలని పేర్కొన్నది.