న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ మంగళవారం ఢిల్లీలో ఇండియా కూటమి నాయకులు భారీ నిరసన చేపట్టారు. పార్లమెంట్లోని మకర్ ద్వార్ నుంచి ఎన్నికల సంఘం (ఈసీఐ) ప్రధాన కార్యాలయానికి వారు చేపట్టిన ర్యాలీని ఢిల్లీ పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓబ్రియన్ సహా పలువురు విపక్ష ఇండియా కూటమి నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆకాశవాణి ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఇతర ఎంపీలతో పాటు తమను కూడా తీసుకువెళ్లే వరకు వేచి ఉండకుండా వారిద్దరూ తమ మార్గాన్ని మార్చుకుని బ్రాడ్కాస్టింగ్ హౌస్లోకి ప్రవేశించారు. దీంతో రోడ్డుపై జరుగుతున్న నిరసన, ప్రాంగణం లోపల ఊహించని ధర్నాగా మారిపోయింది. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వారితో చేరగా తమను ఎన్నికల సంఘం వద్దకు వెళ్లనివ్వాలని లేదా తమ నిరసనను కొనసాగించడానికి ఢిల్లీలో ఒక నిర్దిష్ట స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేస్తూ గంటల తరబడి అక్కడే ఉండిపోయారు. ఆకాశవాణి భవన్లో 8 గంటలకు పైగా తమ నిరసనను కొనసాగించిన తర్వాత మంగళవారం సాయంత్రం రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇండియా కూటమికి, అధికారులకు మధ్య రోజంతా సాగిన ఘర్షణకు తెర పడింది.
అంతకుముందు, ఇండియా కూటమి ర్యాలీని పోలీసులు అడ్డుకున్న సమయంలో పార్లమెంట్ వీధిలోని నీతి ఆయోగ్ కార్యాలయం వద్ద రాహుల్ గాంధీ, అభిషేక్ బెనర్జీ పోలీసు బారికేడ్లపైకి ఎక్కి నిరసన తెలిపారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తుండగా రాహుల్ ఒక బారికేడ్ పైనుంచి త్రివర్ణ పతాకాన్ని ఊపారు. నీతి ఆయోగ్ ప్రాంతం వద్ద బారికేడ్లతో మార్గాన్ని అడ్డుకునే సమయానికి నిరసనకారులు ఈసీఐ కార్యాలయానికి 250-300 మీటర్ల దూరంలో ఉన్నారు. మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక, అఖిలేశ్, సుప్రియా సూలే, ఇతర విపక్ష నాయకులతో కలిసి రాహుల్ సీఈసీ జ్ఞానేశ్ కుమార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఈసీ పదవీకాలం ముగిసిపోయిందని, ఆయన తక్షణమే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్, ఇక చాలు బ్రో. రాజీనామా చేసే సమయం ఆసన్నమైంది అని రాహుల్ అన్నారు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించి జరిగిన అవకతవకలకు నిరసనగా నిరసనకారులు ఓట్ చోర్, గద్దీ చోడ్(ఓట్ల దొంగ, గద్దె వదులుకో) అంటూ నినాదాలు చేశారు. సీఈసీ అక్రమాలకు బీజేపీయే సూత్రధారి అని ఆరోపిస్తూ బ్యానర్లను ప్రదర్శించారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మకర్ ద్వార్ వద్ద ప్రారంభమైన ఇండియా కూటమి ర్యాలీలో ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి చేపట్టిన ర్యాలీకి ఆప్, డీఎంకే దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్లే తాము దూరంగా ఉంటున్నామని ఇప్పటికే డీఎంకే తెలిపింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. సీఈసీ తీరుపై తమ పార్టీకి ప్రత్యేక లక్ష్యం ఉందని.. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తమ నాయకులు పోరాడుతున్నారని తెలిపారు. ఇది ప్రజలకు సంబంధించిన అతిపెద్ద సమస్య కాబట్టి కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పాల్గొనకుండా.. సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తామన్నారు. గతంలోనూ నీట్ పేపర్ లీకైనప్పుడు ప్రధాని నివాసం ముందు కాంగ్రెస్ ధర్నా చేయడాన్ని ఆప్ పార్టీ తప్పుబట్టింది. ఈ ఊహాగానాలతో ఇండియా కూటమిలో అంతర్గత చిచ్చు మొదలైందనే సంకేతాలు వెలువడుతున్నాయి.