న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం ఫోన్ చేశారు. భారత్‌లో జరుగనున్న జీ20 సమ్మిట్‌కు (G20 Summit)కు తాను రాలేకపోతున్నట్లు తెలిపారు. రష్యా తరుఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని చెప్పారు. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సు, ద్వైపాక్షిక సహకారం, ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై మోదీ, పుతిన్ చర్చించుకున్నారు.
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు జీ20 సమ్మిట్ జరుగనున్నది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా పలు దేశాధినేతలు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వ్యక్తిగతంగా హాజరుకావడం లేదని ఆ దేశం శుక్రవారం స్పష్టం చేసింది. వర్చువల్‌గా సదస్సులో పాల్గొనవచ్చని తెలిపింది.
మరోవైపు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆరోపించింది. ఈ నేపథ్యంలో పుతిన్ అరెస్ట్ కోసం వారెంట్ కూడా జారీ చేసింది. దీంతో అరెస్ట్ భయం వల్ల ఆయన విదేశాల్లో ప్రయాణించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దక్షిణ ఆఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అయితే వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. జీ20 సమ్మిట్‌లో కూడా పుతిన్ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగిస్తారని తెలుస్తున్నది.