R-Day parade | ఒకరు మేజర్.. మరొకరు కెప్టెన్.. ఇద్దరూ దంపతులు.. వారిద్దరూ ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ రాజ్‌పథ్ వేదికగా జరిగే `కర్తవ్య పథ్` పరేడ్‌లో భాగస్వాములు కానున్నారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో దంపతులిద్దరూ పాల్గొనడం ఇదే తొలిసారి. వారే మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ. అయితే వారిద్దరూ వేర్వేరు కంటింజెంట్లలో సభ్యులుగా పరేడ్‌లో పాల్గొంటారు. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో దంపతులిద్దరూ పాల్గొనడం రిపబ్లిక్ డే పరేడ్ల చరిత్రలో ఇదే తొలిసారి అని మేజర్ బ్లైజ్ చెప్పారు. గతేడాది జూన్‌లో వీరిద్దరు ఒక్కటయ్యారు. తాము పరేడ్‌లో పాల్గొనే సందర్భం రావడం యాదృచ్ఛికం అని మేజర్ బ్లైజ్ అన్నారు.
`ఇది ప్రణాళికాబద్ధంగా జరుగలేదు. కేవలం యాదృచ్ఛికం. తొలుత నిర్వహించిన పరేడ్ పరీక్షకు హాజరై పాస్ అయ్యాను. అటుపై నా భర్త తన రెజిమెంట్ నుంచి ఎంపికయ్యారు` అని కెప్టెన్ సుప్రీత చెప్పారు. వీరిద్దరూ కళాశాల విద్యా సమయంలో నేషనల్ కెడేట్ కార్ప్స్ (ఎన్సీసీ)లో పని చేయడం ఆసక్తికర పరిణామం.
`కర్తవ్యపథ్ వద్ద 2016లో జరిగిన ఎన్సీసీ రిపబ్లిక్ డే పరేడ్‌లో నా భార్య భాగస్వామి. అంతకుముందు 2014 ఎన్సీసీ రిపబ్లిక్ డే క్యాంప్‌లో నేను భాగస్వామి. కర్తవ్యపథ్ వద్ద 2024 రిపబ్లిక్ డే పరేడ్‌లో మా రెజిమెంట్‌కు సారధ్యం వహించడానికి ఇది కూడా ఒక స్ఫూర్తిదాయక అంశం. మా రెజిమెంట్‌కు గర్వకారణం` అని మేజర్ బ్లైజ్ పేర్కొన్నారు.
కెప్టెన్ సుప్రీత.. కర్ణాటకలోని మైసూర్ జేఎస్ఎస్ లా కళాశాలలో లా గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. తమిళనాడులోని వెల్లింగ్టన్ వాసి మేజర్ బ్లైజ్ తన గ్రాడ్యుయేషన్ బెంగళూరులోని జైన్ యూనివర్సిటీలో పూర్తి చారు. ప్రస్తుతం మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ దంపతులు ఢిల్లీలో నివసిస్తున్నారు.
మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ వేర్వేరు రెజిమెంట్ల నుంచి వేర్వేరుగా పరేడ్ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు. `మద్రాస్ రెజిమెంట్ నుంచి నా భర్త, మిలిటరీ పోలీస్ కంటింజెంట్ కార్ప్స్కు నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాం` అని కెప్టెన్ సుప్రీత పేర్కొన్నారు. `పరేడ్‌లో పాల్గొనేందుకు మమ్ముల్ని వేర్వేరు ప్రాంతాల్లో నియమించారు. రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనేందుకు మేం ఇద్దరం రెండు నెలలుగా గడిపేందుకు అవకాశం లభించింది. మా ఇద్దరికీ, మా కంటింజెంట్లకు చాలా గర్వకారణం` అని సుప్రీత పేర్కొన్నారు. తమకు ఈ అవకాశం లభించినందుకు తమ కుటుంబాలు గర్వ పడుతున్నాయని, పరేడ్‌కు తమ కుటుంబ సభ్యులు కూడా హాజరవుతారని మేజర్ జెర్రీ బ్లైజ్, కెప్టెన్ సుప్రీత సీటీ తెలిపారు.