పాట్నా : బిహార్‌లో ఓ వింత ఘటన వెలుగుచూసింది. ఖిలాఫత్నగర్కు చెందిన చావీ ముసాహర్ అనే యువకుడు 12 సంవత్సరాల కిందట ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. సదరు యువకుడు చనిపోయాడని కుటుంబీకులు సైతం అంత్యక్రియలు నిర్వహించారు. 12 సంవత్సరాల తర్వాత యువకుడు పాక్ జైలులో ఉన్నట్లు సమాచారం అందింది. అయితే, చావి ముసాహర్ బతికే ఉన్నాడని తెలియడంతో ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేస్తూ.. అతన్ని భారత్‌కు తీసుకురావాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చావి అదృశ్యమైన సమయంలో అతని వయసు 18 సంవత్సరాలు, ఇప్పుడు 30 సంవత్సరాల వయసు. ఇంట్లో నుంచి వెళ్లినప్పుడు చాలా రోజుల పాటు వెతికా ఆచూకీ దొరక్కపోవడంతో చనిపోయినట్లుగా భావించారు. ఆ సమయంలో మానసిక పరిస్థితి సైతం బాగా లేదని, అప్పటికే అతనికి పెళ్లి కాగా.. ఓ బిడ్డ కూడా ఉన్నాడని పేర్కొన్నారు. అతని తండ్రి చనిపోగా.. అతని భార్య రెండో పెళ్లి చేసుకున్నది.
అతనికి సంబంధించి గుర్తింపు పత్రాలు ముఫాసిల్ పోలీస్‌స్టేషన్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి చేరాయి. దీంతో కుటుంబీకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. యువకుడిని చావి ముసాహర్గా గుర్తించారు. ఈ విషయంపై జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నీరజ్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ చావీ ముసాహర్ను అతని కుటుంబ సభ్యులు గుర్తించారని పేర్కొన్నారు. విచారణ నివేదికలను మంత్రిత్వ శాఖ పంపనున్నట్లు తెలిపారు.