ఇండోర్, ఆగస్టు 6: సాయుధ బలగాల సిబ్బంది భద్రతను, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇండోర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రత్యేకమైన బూట్లను తయారు చేసింది. విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే టెక్నాలజీతో కూడిన ఈ బూట్లను ధరించడం ద్వారా సైనికులు తామున్న రియల్ టైమ్ లొకేషన్‌ను తెలుసుకునేందుకు కూడా వీలవుతుందని అధికారులు మంగళవారం వెల్లడించారు. తొలి బ్యాచ్‌లో తయారు చేసిన 10 జతల బూట్లను ఇప్పటికే రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు పంపినట్టు ఇండోర్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సుహాస్ జోషి తెలిపారు. ప్రొఫెసర్ ఐఏ పళని మార్గదర్శకత్వంలో ప్రయోగాత్మకంగా ఈ బూట్లను తయారు చేసినట్టు చెప్పారు.
ట్రైబో-ఎలక్ట్రిక్ నానోజెనరేటర్ (టీఈఎన్జీ) టెక్నాలజీతో కూడిన ఈ బూట్లు ప్రతి అడుగుకూ విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని, ఆ బూట్ల అడుగు భాగం (సోల్)లోని డివైజ్‌లో నిల్వ చేసుకోగలిగే ఆ విద్యుత్తుతో చిన్న చిన్న పరికరాలను ఆపరేట్ చేసుకోవచ్చని వివరించారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్), రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) సాంకేతికతలను కలిగి ఉండే ఈ బూట్లను ధరించడం ద్వారా సైనికులు తమ రియల్ టైమ్ లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చని, అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న సీనియర్ సిటిజన్లు (వృద్ధులు), విద్యార్థులు, పర్వతారోహకులకు సైతం ఈ బూట్లు ఎంతో ఉపకరిస్తాయని ప్రొఫెసర్ సుహాస్ జోషి తెలిపారు.