న్యూఢిల్లీ, నవంబర్ 27 : భారతదేశంలో దోమలబెడద లేని ప్రదేశం అంటూ ఉండదు. ఇక దోమల బారిన పడకుండా ఉండేందుకు ద్రవ రూపంలో ఉండే గుడ్‌నైట్, ఆలౌట్ వంటి రిపెల్లెంట్లు, క్రీములు, లోషన్లు, కాయిల్స్, అగరవత్తుల వంటివి అనేకం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ఐఐటీ ఢిల్లీకి చెందిన పరిశోధకులు దోమల బెడదను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేకమైన ఉత్పత్తిని అభివృద్ధి చేశారు. అదే మస్కిటో రిపెల్లెంట్ డిటర్జెంట్. ఐఐటీ ఢిల్లీలోని టెక్స్టైల్, ఫైబర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ జావేద్ నబీబక్ష నేతృత్వంలోని పరిశోధకుల బృందం ఈ డిటర్జెంట్‌ను రూపొందించింది. ఈ డిటర్జెంట్‌తో బట్టలు ఉతికినప్పుడు ఆ వస్ర్తాల నాణ్యతపై ఎటువంటి ప్రభావం ఉండకపోగా.. వాటిని ధరించిన వారిని దోమలు దరిచేరవని అంటున్నారు.
ఈ డిటర్జెంట్లు పౌడర్గాను, ద్రవ రూపంలోనూ ఉన్నాయని తెలిపారు. సాధారణంగా మనం ఉపయోగిస్తున్న రిపెల్లెంట్లు, కాయిల్స్ లేదా లోషన్ల వల్ల దోమల నుంచి కొద్దిసేపే రక్షణ ఉంటుందని, కానీ తమ డిటర్జెంట్ వాటికన్నా ఎంతో మెరుగైనదని పేర్కొన్నారు. తమ ఉత్పత్తి దోమల కారణంగా వచ్చే ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని అన్నారు. తమ పరిశోధనలో భాగంగా.. ఈ డిటర్జెంట్‌తో ఉతికిన వస్ర్తాలను చేతులకు తొడుగుకొని ఆకలితో ఉన్న దోమలను ఉంచిన డబ్బాలో పెట్టినప్పుడు.. ఆ చేతులపై వాలిన దోమల ఆధారంగా ఈ డిటర్జెంట్ పనితనాన్ని అంచనా వేశామని జావేద్ వివరించారు.