Sanjay Raut : ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్ (Sabka Sath, Sabka Vikas)’ అనేది మా కూటమి నినాదమని, అందరినీ అభివృద్ధి చేసేది ‘మహా వికాస్ అఘాడీ (Maha Vikas Aghadi)’ కూటమి మాత్రమేనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. మహారాష్ట్రలో ఇప్పుడు బలంగా ఉన్న పార్టీలు మూడు మాత్రమేనని.. కాంగ్రెస్, శరద్‌పవార్ కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే శివసేన మాత్రం బలంగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపు తమ కూటమిదేనని రౌత్ ధీమా వ్యక్తంచేశారు.
ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు సమానంగా సీట్లు పంచుకుని బరిలో దిగుతున్నాయని సంజయ్ రౌత్ చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అన్ని స్థానాల్లో పోటీ చేసిందని, కానీ అధికారంలోకి మాత్రం రాలేకపోయిందని ఆయన గుర్తుచేశారు. అందుకే మహారాష్ట్రలో అందరం ఒక్కటై ముందుకు వెళ్లడం మంచిదనేది తన అభిప్రాయమని అన్నారు. కాగా మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మహాకూటమిలోని మూడు పార్టీలు 85 చొప్పున స్థానాల్లో బరిలో దిగనున్నాయి.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే మహారాష్ట్రలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుండగా, మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను నవంబర్ 23న వెల్లడించనున్నారు.