Brain | న్యూఢిల్లీ : మెదడులోని కొంత నిర్దేశిత ప్రాంతం దెబ్బ తింటే అది మత ఛాందస వాదానికి దారి తీయవచ్చునని ఓ పరిశోధనలో తేలింది. నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన న్యూరోస్పిరిచ్చువాలిటీ రీసెర్చి సెంటర్ డైరెక్టర్ మైఖేల్ ఫెర్గూసస్ తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెయిన్ నెట్‌వర్క్‌కు మతపరమైన భావాలకు సంబంధం ఉంది. దీని కోసం వారు లెసియన్ నెట్వర్క్ మేపింగ్ విధానాన్ని అనుసరించారు. దీని ద్వారా మెదడులోని వివిధ ప్రాంతాలు ఎలా అనుసంధానించి ఉన్నాయో, ఒక ప్రాంతానికి నష్టం, వాటి సంబంధిత మెదడు పనితీరుకు ఎలా అంతరాయం కలిగిస్తుందో గుర్తించడంలో ఇది సహాయపడుతుంది.
దీంతో మెదడు దెబ్బతిన్న రెండు గ్రూపులను ఎన్నిక చేసుకుని వీరు పరిశోధనలు జరిపారు. మొదటి గ్రూప్‌లో యుద్ధంలో పాల్గొన్న మధ్య వయస్కులుగా ఉండి మెదడు గాయాలతో బాధపడుతున్న వారు. రెండో గ్రూప్‌లో వివిధ కారణాలతో మెదడు దెబ్బతిన్న సామాన్య రోగులు. ఈ రెండు గ్రూపులకు మత ఛాందసవాదంపై ఒక స్కేల్‌ను పూర్తి చేశారు. తర్వాత మెదడు దెబ్బతిన్న కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను సీటీ, ఎంఆర్ఐల ద్వారా విశ్లేషించారు. అనంతరం కుడి అర్థభాగంలో మెదడు దెబ్బతిన్న వారు ఎక్కువగా మత ఛాందసవాద భావాలు కలిగి ఉన్నట్టు నిర్ధారించారు. ఈ ఫలితాలు ఆశ్చర్యపరిచినట్టు మైఖేల్ చెప్పారు.