ముంబై: టీవీ నటి తునిషా శర్మ (21) ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్నది. తునిషా మరణించిన కొన్ని గంటలకే నిందితుడు షీజాన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇద్దరి మధ్య సంబంధాలపై వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. షీజాన్ ఖానే తునిషా శర్మను ఆత్మహత్యకు ప్రేరేపించాడన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నారు.
శనివారం సాయంత్రం తునిషా శర్మ సీరియల్ షూటింగ్ సెట్లోనే ఆత్మహత్యకు పాల్పడగా.. ఆదివారం తెల్లవారుజామున పోలీసులు నిందితడు షీజాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో షీజాన్కు శిక్షపడే వరకు తాను వదిలిపెట్టబోనని తునిషాశర్మ తల్లి వనితా శర్మ ఇవాళ ముంబైలో ప్రెస్మీట్లో చెప్పారు. షీజాన్ మోసం చేయడంవల్లే తట్టుకోలేక తన బిడ్డ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె ఆరోపించారు.
తునిషా, షీజాన్ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారని.. ఈ క్రమంలో హిజాబ్ ధరించాలని, ఇస్లాం మతం స్వీకరించాలని షీజాన్ ఒత్తిడి చేశాడని, అందుకు తునిషా కూడా ఒప్పుకుందని వనితా శర్మ తెలిపారు. అయితే ఆత్మహత్యకు 15 రోజుల ముందు తునిషాకు షీజాన్ ఫోన్లో కనిపించిన చాటింగ్ మెసేజ్‌లు వారి మధ్య గొడవకు కారణమయ్యాయని అన్నారు.
షీజాన్ మరో అమ్మాయితో అసభ్యంగా చాట్ చేయడం తట్టుకోలేక తునిషా నిలదీసిందని, దాంతో షీజాన్ తన బిడ్డను కొట్టాడని, ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోపో అంటూ మొండిగా సమాధానం చెప్పాడని వనితా ప్రెస్మీట్లో వెల్లడించారు. తునిషా ద్వారా విషయం తెలుసుకున్న తాను కూడా షీజాన్కు ఫోన్ చేసి అడిగానని, తనతో కూడా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ దురుసుగా సమాధానం ఇచ్చాడని తెలిపారు.
అప్పటి నుంచి తునిషా డిప్రెషన్లోకి వెళ్లిందని, ఆ డిప్రెషన్‌ను భరించలేకనే చివరికి ప్రాణాలు తీసుకుందని వనితా శర్మ చెప్పారు. తన బిడ్డ మరణానికి కారణమైన షీజాన్కు శిక్షపడేదాక తాను విడిచిపెట్టనని పేర్కొన్నారు. షీజాన్ తల్లి, అక్కాచెల్లెండ్లు అందరితో తునిషా కలిసిపోయిందని, కానీ చివరికి మోసపోయి తట్టుకోలేక తీవ్ర నిర్ణయం తీసుకుందని ఆమె వాపోయారు.