న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై సుప్రీం కోర్టు (Supreme Court) వెలువరించిన తీర్పును తాము స్వాగతిస్తున్నామని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు కూడా తాము మద్దతు పలికామని ఆయన తెలిపారు.
అదేవిధంగా జమ్ముకశ్మీర్‌లో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు చెప్పిందని, ఆ నిర్ణయాన్ని కూడా తాము స్వాగతిస్తున్నామని ఎంపీ సంజయ్ రౌత్ చెప్పారు. అక్కడి ప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే సర్వ హక్కులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఆర్టికల్ 370 రద్దుపై ఇవాళ కేంద్రం వినిపించిన వాదనలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్టికల్ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమేనని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది.
ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగబద్ధంగానే ఆర్టికల్ 370 రద్దు జరిగిందని తెలిపింది. ఆర్టికల్ 370 రద్దు వెనుక ఎలాంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న కేంద్రం రద్దు చేసింది.