Devendra Fadnavis : తనను మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలిపారు. ‘నన్ను ఏకగ్రీవంగా శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. కేంద్ర పరిశీలకులు విజయ్‌రూపానీ, నిర్మలా సీతారామన్లకు కూడా కృతజ్ఞతలు’ అని ఫడ్నవీస్ చెప్పారు.
ఈసారి మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు చారిత్రాత్మక ఎన్నికలని, ఈ ఎన్నికల ద్వారా ‘ఏక్ హై తో సేఫ్ హై’ అదేవిధంగా ‘మోదీ హై తో మమ్కిన్ హై’ అనే విషయం రుజువైందని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు. దేశంలో తమ విజయాల పరంపర పునఃప్రారంభమైందని ఆయన చెప్పారు. ఇంతకుముందు హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఘన విజయాలు సాధించిందని అన్నారు.
మహారాష్ట్ర ఓటర్లు బీజేపీకి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారని, వారందరికీ తాను శిరసు వంచి నమస్కరిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు. మహారాష్ట్ర కేర్ టేకర్ సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లకు కూడా ఫడ్నవీస్ కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఫడ్నవీస్ రేపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.