న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో తమకు భావజాల సంబంధాలున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గోవాలని కోరుతూ తనకు ఎలాంటి ఆహ్వానం అందలేదని అఖిలేష్ యాదవ్ ఇటీవల అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనన్న ఆయన ఈ యాత్రలో తాను పాల్గోబోనని స్పష్టం చేశారు.
కాగా, జనవరి 3న ‘భారత్ జోడో యాత్ర’ ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించనున్నది. ఈ నేపథ్యంలో అఖిలేష్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందించారు. ద్వేషానికి వ్యతిరేకంగా సాగుతున్న ఈ యాత్రలో అఖిలేష్ యాదవ్, మాయావతికి కూడా సంబంధం ఉందని తెలిపారు. ‘భారత్ జోడో యాత్ర’ అందరికీ తెరిచి ఉందని, అయితే అందులో ఎవరు పాల్గొంటారనే దానిపై తాను వ్యాఖ్యానించబోనని చెప్పారు. ‘ద్వేషం, ప్రేమ అనేవి పూర్తిగా వ్యతిరేకం. కానీ చాలా మంది ప్రేమను పంచాలని కోరుకుంటారు. అఖిలేష్ జీ, మాయావతి జీ ద్వేషాన్ని కోరుకోరని నాకు తెలుసు. రిష్తాతో హై’ అని అన్నారు.
మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఒకేలా ఉండవని, ఇది అందరికీ తెలుసని రాహుల్ గాంధీ అన్నారు. ‘ఒకవేళ బీజేపీ, కాంగ్రెస్ ఒకటే అయితే కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను ప్రధాని మోదీ కోరుకునేవారు కాదు’ అని వ్యాఖ్యానించారు. ఒకవేళ బీజేపీ ముక్త్ భారత్ కోసం అఖిలేష్ అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. అలా అయితే తన దృక్పథం ఏమిటో అన్నది చెప్పే అవకాశం అఖిలేష్‌కు ఉందని అన్నారు.