న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల భారీగా జనం గుమిగూడి నిరసన తెలిపారు. (Huge Protest) భారత్‌లో ఉగ్ర దాడులకు పాల్పడుతున్న ఆ దేశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ భారీ నిరసన నేపథ్యంలో పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. జాతీయ జెండాలను చేతపట్టి నిరసన చేస్తున్న జనాన్ని శాంతింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు.
కాగా, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతా వినియోగాన్ని భారత్ నిలిపివేసింది. దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. పాకిస్థాన్ దౌత్య సిబ్బందిని బహిష్కరించింది. భారత్, పాకిస్థాన్ హైకమిషన్లలోని సిబ్బంది సంఖ్యను 55 నుంచి 30కు తగ్గించింది.
మరోవైపు ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ నుంచి రక్షణ, నౌకాదళం, వైమానిక సలహాదారులందరినీ భారత్ బహిష్కరించింది. వారంలోగా దేశం విడిచి వెళ్లాలని వారికి సూచించింది. అలాగే ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ నుంచి సైనిక సలహాదారులను ఉపసంహరించింది. ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో సేవా సలహాదారులకు కేటాయించిన ఐదుగురు సహాయక సిబ్బందిని కూడా భారత్ రీకాల్ చేసింది.
ভারতে পাকিস্তান হাইকমিশনের বাইরে বিক্ষোভ। #India #Kashmir #Pakistan #Pahalgam pic.twitter.com/dpYLrlHqkz
— Public Press BD (@bd_public) April 24, 2025