న్యూఢిల్లీ: మీ టోల్ ఫీజు ఎలా లెక్కించబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..? టోల్ వసూలు కోసం ఉపయోగించే ఫార్ములా ఏంటో మీకు తెలుసా..? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం.. జాతీయ రహదారుల్లో వాహనదారుల నుంచి టోల్ రుసుము ఎంత వసూలు చేయాలనేది రెండు పద్ధతుల్లో లెక్కిస్తారు. పబ్లిక్లీ ఫండెడ్ టోల్ ప్లాజాలకు నేషనల్ హైవేస్ ఫీ రూల్స్-2008 ని వర్తింపజేస్తారు. BOT టోల్ ఫీ ప్లాజాలకు అప్పటి ఫీ రూల్స్, రాయితీ నిబంధనల ఒప్పందం వర్తిస్తాయి.
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్-2008 ప్రకారం.. నాలుగు లేన్లు అంతకంటే ఎక్కువ లేన్ల జాతీయ రహదారులపై టోల్ రేటును ఈ విధంగా లెక్కిస్తున్నారు. టోల్ రేట్ = రహదారి పొడవు (కి.మీ) x ప్రతి కిలోమీటర్ బేస్ రేట్ (రూ/కి.మీ). 2007-08 సంవత్సరానికి వాహన రకాన్ని బట్టి ప్రతి కిలోమీటర్‌కు బేస్ రేట్లు ఈ విధంగా ఉండేవి. కారు, జీపు, వ్యాన్, లైట్ మోటార్ వెహికల్‌కు కిలోమీటర్‌కు రూ.0.65.. లైట్ గూడ్స్ వాహనాలు, మినీ బస్సులకు కిలోమీటర్‌కు రూ.1.05.. బస్సు, ట్రక్కులకు కిలో మీటర్‌కు రూ.2.20.. త్రీ యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.2.40.. HCM, EME, MAV వాహనాలకు కిలోమీటర్‌కు రూ.3.45, భారీ వాహనాలకు కిలోమీటర్‌కు రూ.4.20 చొప్పున వసూలు చేసేవారు.
ప్రస్తుత ఫీ రూల్స్ ఆధారంగా ప్రతి కిలోమీటర్‌కు వాహనదారు చెల్లించాల్సిన రుసుములను ప్రతి ఏడాది ఏప్రిల్ 1న సవరిస్తారు. ఎక్స్‌ప్రెస్‌వేలపై టోల్ చార్జీలు నాలుగు లేన్ల జాతీయ రహదారుల కంటే 1.25 రెట్లు ఎక్కువ ఉంటాయి. వాహనం వెడల్పు మూడు మీటర్ల కంటే మించితే రెండు లేన్ల రహదారులపై నాలుగు లేన్ల జాతీయ రహదారులపై వసూలు చేసే టోల్ చార్జిలో 60 శాతం వసూలు చేస్తారు.
నేషనల్ హైవేస్ టోల్ ప్లాజాల దగ్గర పబ్లిక్ క్యారియర్లకు ఎలాంటి మినహాయింపులు ఉండవు. అయితే ప్రముఖులను తీసుకెళ్లే కొన్ని మెకానికల్/సెక్యూరిటీ వాహనాలకు, అధికారిక అవసరాల కోసం గుర్తింపు కలిగిన అధికారులు ఉపయోగించే వాహనాలకు, నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ – 2008 కింద పేర్కొన్న వాహనాలకు మినహాయింపులు వర్తిస్తాయి.
నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ (FASTag) కలెక్షన్ ప్రోగ్రామ్ ఎఫెక్ట్‌లను అంచనా వేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. ఫాస్ట్‌ట్యాగ్ అమలు తర్వాత.. మెరుగైన కార్యాచరణ సామర్థ్యం, ఇంధన పొదుపు, త్రోపుట్ పెరుగుదల, రాబడిలో వృద్ధి, పలు ఇతర ప్రయోజనాలను కలిగాయని అధ్యయనంలో వెల్లడైంది.
పబ్లిక్ ఫండెడ్ టోల్ ప్లాజాల కోసం సేకరించిన యూజర్ ఫీజును షరతులకు అనుగుణంగా ఏజెన్సీ ద్వారా టోల్ ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత ఈ మొత్తం కన్సాలిడేటెడ్ ఫండ్స్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేయబడుతుంది. BOT/OMT/TOT కన్సెషనర్ ఫీ ప్లాజాల కోసం రాయితీదారు యూజర్ ఫీని సేకరిస్తారు.