న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కసరత్తు చేస్తున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను (Centre amends rules) కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) మనోజ్ సిన్హాకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని అధికారాలు కల్పించింది. అంతర్గత భద్రత, బదిలీలు, ప్రాసిక్యూషన్, అటార్నీ-జనరల్, ప్రభుత్వ న్యాయవాదుల నియామకంతో సహా కీలకమైన విషయాల్లో ఎల్జీదే పెత్తనం కానున్నది. ‘చట్టం ప్రకారం లెఫ్టినెంట్ గవర్నర్ విచక్షణాధికారాన్ని అమలు చేయడానికి పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఏఐఎస్, ఏసీబీ, ఆర్థిక శాఖకు సంబంధించి అవసరమయ్యే ఏ ప్రతిపాదననూ చీఫ్ సెక్రటరీ ద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ ముందు ఉంచితే తప్ప ఆమోదం లేదా తిరస్కారం పొందదు’ అని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
కాగా, జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ బిజినెస్ రూల్స్ 2019ను కూడా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. దీంతో జూలై 12న గెజిట్లో పేర్కొనడంతో ఈ నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వానికి అధికారాలు పరిమితంగా ఉండనున్నాయి.