మంగళవారం 31 మార్చి 2020
National - Feb 23, 2020 , 02:22:16

ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

ఇద్దరు లష్కరే ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు లష్కరే తాయిబా ఉగ్రవాదులు హతమైనట్టు పోలీసులు తెలిపారు. మృతులను కుల్గామ్‌ జిల్లాకు చెందిన నవీద్‌ అహ్మద్‌భట్‌గా, వాన్‌పొరాకు చెందిన అఖిబ్‌ యాసిన్‌భట్‌గా గుర్తించినట్టు రాష్ట్ర డీజీపీ దిల్‌బాగ్‌సింగ్‌ పేర్కొన్నారు. దక్షిణ కశ్మీర్‌ బిజ్‌బెహర్‌ ప్రాంతంలోని సంగం వద్ద ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్టు తెలిపారు. ఘటనాస్థలంలో పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. 2018లో లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థలో చేరిన నవీద్‌ అహ్మద్‌ భట్‌ అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని తెలిపారు. అతడిపై ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని పేర్కొన్నారు. 2019 జూన్‌లో ఉగ్రవాద సంస్థలో చేరిన అఖిబ్‌ యాసిన్‌ భట్‌ కూడా అనేక ఉగ్రదాడుల్లో పాల్గొన్నాడని డీజీపీ వెల్లడించారు.


హిజ్బుల్‌ కమాండర్‌ అరెస్టు

ఉత్తర కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలో హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన కమాండర్‌ జునైద్‌ ఫరూ ఖ్‌ పండిత్‌ను పోలీసులు అరెస్టుచేశారు. ఫిబ్రవరి 5న నర్బాల్‌ నగర శివారులో భద్రతా బలగాల బృందంపై దాడి ఘటనకు ఇతడే సూత్రధారి అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులయ్యారు. 


logo
>>>>>>