Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి (Jarkhand CM), జార్ఖండ్ ముక్తిమోర్చా (JMM) పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ (Hemanth Soren) బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ గత రెండు దశాబ్దాలుగా జార్ఖండ్ రాష్ట్రాన్ని నిమ్మకాయను పిండినట్టు పిండేసిందని ఆయన ఫైరయ్యారు. పేద రాష్ట్రాల వెన్నెముకని బీజేపీ విరిచేసిందని అన్నారు. జార్ఖండ్‌లో మరో నాలుగు రోజుల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హేమంత్ సోరెన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఎమ్మెల్యేలు, ఎంపీలను బీజేపీ తమ వైపుకి తిప్పుకుని డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలను సృష్టిస్తూ దేశ సమాఖ్య వ్యవస్థ నిర్మాణాన్ని నాశనం చేస్తోందని సోరెన్ మండిపడ్డారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సోరెన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మాటట్లోనే.. ‘గత 20 ఏళ్లలో బీజేపీ జార్ఖండ్‌ను నిమ్మకాయలా పిండేసింది. బీజేపీ తీరును ఎండగట్టాలి. ఆ పార్టీ చర్యలకు ఇకనైనా ఫుల్స్టాప్ పెట్టాలి. మేం ఆవుకు ఆహారం వేస్తే వాళ్లు పాలు పిండుకుంటారు. బీజేపీ చర్యలను ఇకపై అనుమతించకూడదు. బీజేపీ జార్ఖండ్ సంపదను దోచుకుంది. బీజేపీ తీరువల్ల ఖనిజ వనరులతో సమృద్ధిగా ఉన్న జార్ఖండ్ ఇప్పుడు పేద రాష్ట్రాల జాబితాలో చేరింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
‘మాకు బొగ్గు, ఇనుప ఖనిజం, బాక్సైట్ డోలమైట్ వంటి వనరులు సమృద్ధిగా ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ విధానం వల్ల ఆదాయ సేకరణకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఈ విధానంతో జార్ఖండ్ లాంటి రాష్ట్రాల వెన్నెముకలను కేంద్రం విరిచేసింది. ప్రధాని నరేంద్ర మోదీకి పదేపదే లేఖలు రాసినప్పటికీ రాష్ట్రానికి రావాల్సిన రూ. 1.36 లక్షల కోట్ల బొగ్గు బకాయిలు ఇంకా రానే లేదు. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నది. హిందూ, ముస్లిం అంటూ మతాల నడుమ చిచ్చు పెడుతూ కేవలం హిందూ అజెండానే అనుసరిస్తున్నది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ అధికారంలోకి వస్తున్నది. బీజేపీ పాలనలో ఆరోగ్యకరమైన రాజకీయ పోటీ లేకపోవడం దురదృష్టకరం’ అని సోరెన్ మండిపడ్డారు.