Heat wave : రాజస్థాన్ (Rajasthan) లో భానుడు భగ్గున మండుతున్నాడు. దాంతో జనం ఇళ్ల నుంచి అడుగు బయటపెట్టాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా జైసల్మేర్ (Jaisalmer), బర్మేర్ (Barmer) పట్టణాల్లో ఎండలు మండిపోతున్నాయి. రానున్న రెండు మూడు రోజులు కూడా ఎండలు మరింత పెరిగే అవకాశం ఉన్నదని జైపూర్ (Jaipur) లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
బర్మేర్లో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని, సీజనల్ సగటు కంటే ఇది 6.8 డిగ్రీల సెల్సియస్ అధికమని చెప్పారు. బర్మేర్లో 1998 ఏప్రిల్ మొదటి వారంలో 45.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఈ ఏప్రిల్ తొలి వారంలో అంతకంటే 0.4 డిగ్రీలు ఎక్కువగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు.
అయితే బర్మేర్లో పగటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గత వారం రోజులుగా ఎక్కువగానే నమోదవుతున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. ఇవాళ 28.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఇది కూడా సగటు కంటే 6.4 డిగ్రీ సెల్సియస్ అధికమని చెప్పారు. జైసల్మేర్లో కూడా 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. రాజస్థాన్లోని మొత్తం 21 నగరాల్లో 40 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతలే రికార్డవుతున్నాయని చెప్పారు.