న్యూఢిల్లీ, జూన్ 3: పొడుగ్గా ఉంటే చాలా లాభాలు ఉంటాయని మనం వింటూనే ఉంటాం. ఆరోగ్యపరంగా కూడా లాభాలు ఉన్నాయని తాజా పరిశోధనలో తేలింది. పొడుగ్గా ఉన్నవారిలో గుండె సంబంధ వ్యాధులు, బీపీ, అధిక కొవ్వు వంటి సమస్యలు కూడా దరి చేరవని పేర్కొంటున్నది. ఈ అధ్యయనం వివరాలు పీఎల్వోఎస్ జెనెటిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని అధ్యయనం ద్వారా తెలుస్తున్నది. పొడుగ్గా ఉండే వారిలో చర్మ సంబంధ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేస్తున్నది. నాడీ కణాల డ్యామేజీ, ఎముకల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పేర్కొన్నది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టింది. 3,23,793 మందికి సంబంధించిన ఆరోగ్య స్థితి గతులపై ఈ అధ్యయనం జరిగింది.