Squid Game | న్యూఢిల్లీ, నవంబర్ 12: అమెరికాలోని (America) భారతీయ ఉద్యోగుల కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హెచ్-1బీ వీసా (H1B Visa) నిబంధనలు కఠినతరం చేసిన తర్వాత కంపెనీలు వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు. తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. జాబ్‌లో చేరినప్పుడు గ్రీన్‌కార్డు (Green Card) ఇస్తామని హామీ ఇచ్చిన కంపెనీ.. ఇప్పుడు ఉద్యోగంలో నుంచి తొలగిస్తామంటూ బెదిరిస్తున్నదని అమృతేశ్ వల్లభనేని అనే ఐటీ ఉద్యోగి స్థానిక కోర్టులో దావా వేసిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు కంపెనీ యజమానితోపాటు భారత సంతతికి చెందిన సీఈవోపై ఫిర్యాదు చేశారు. గ్రీన్‌కార్డును ఎరగా వేసి, ఉద్యోగుల శ్రమదోపిడీ, కులవివక్ష దారుణమని అమృతేశ్ దావాకు సహకరించిన కన్సల్టెంట్ పామర్.. కాలిఫోర్నియాకు చెందిన వార్తా సంస్థ బ్రీట్బార్ట్తో అన్నారు. భారతీయ ఉద్యోగులకు సంబంధించినంత వరకు ఇది ఒక స్క్విడ్ గేమ్ (Squid Game) అని, అంతిమ లక్ష్యం అమెరికాలో ఉండడమేనని చెప్పారు.