జైపూర్ : తన కుమారుడు వైభవ్ గెహ్లాట్ సహా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్ర, పార్టీ ఎమ్మెల్యే ఓం ప్రకాష్ హుద్లాపై ఈడీ చర్యల పట్ల రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లాట్ (Rajasthan Polls) స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా ఈడీ చర్యలను తప్పుపట్టారు. జైపూర్‌లో గురువారం విలేకరుల సమావేశంలో గెహ్లాట్ మాట్లాడుతూ దోతస్రపై ఈడీ దాడులతో పాటు తన కుమారుడికి దర్యాప్తు ఏజెన్సీ సమన్లు జారీ చేయడాన్ని కాషాయ సర్కార్ గూండాగిరీ కాక మరేంటని ప్రశ్నించారు.
ఈరోజు ఎలాంటి పరిస్ధితి నెలకొన్నా తాము భయపడేది లేదని, మీరు ఢిల్లీలో కూర్చుని రాజస్ధానీల మనసు గెలవడం కాకుండా విలువలను దిగజార్చి గూండాగిరీకి తెగబడుతున్నారని బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నారు. కేంద్ర పెద్దల ఒత్తిడి లేకుండా ఈడీ, సీబీఐ ఇక్కడకు రాలేవని అన్నారు. రాజస్ధాన్‌లో ఎగ్జామ్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మనీల్యాండరింగ్ విచారణలో భాగంగా దోతస్రాతో పాటు మహువ అసెంబ్లీ స్దానంలో కాంగ్రెస్ అభ్యర్ధి హుద్లా నివాసాలపై ఈడీ దాడులు చేపట్టడం కలకలం రేపింది.
మరో కేసులో సీఎం అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్‌కు సమన్లు జారీ చేసింది. తనకు ఈడీ సమన్లు జారీ చేయడంపై స్పందిస్తూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రత్యర్ధులను వేధించేందుకే ఇలా చేస్తున్నారని వైభవ్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీరును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు సికార్, జైపూర్‌లో ధర్నా చేపట్టి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Read More :
Cyber Fraud | జ్యూవెలరీ స్టోర్ ఈమెయిల్ ఐడీ చోరీ : రూ 18 లక్షలు కొట్టేసిన స్కామర్లు