గాంధీనగర్, ఆగస్టు 23 : మద్యపాన నిషేధం అమల్లో ఉన్న గుజరాత్లో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య ఆదివారం 13కు చేరుకుంది. భావ్నగర్ పరిసరాల్లో కొద్ది రోజుల క్రితం ఇండియన్ మేడ్-ఫారిన్ లిక్కర్ బ్రాండ్ పేరుతో ఉన్న కల్తీ మద్యాన్ని 67 మంది సేవించగా, పలువురు తీవ్ర అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరారు. గత రెండు రోజుల్లో ఐదుగురు బాధితులు ప్రాణాలు కోల్పోగా, ఆదివారం మరో ఇద్దరు చనిపోయారు.
బాధితులు సేవించిన కల్తీ మద్యంలో విషపూరిత ద్రావణం మెథనాల్ ఉన్నట్టు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. ఈ విషాద ఘటనపై వార్తేజ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. 21 మందిని నిందితులుగా పేర్కొన్నారు. దీంట్లో 13 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 16న ముగ్గురు స్నేహితులు మద్యం సేవించిన తర్వాత తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో ఒకరి తర్వాత ఒకరు మరణించారు. దీంతో కల్తీ మద్యం ఘటన వెలుగు చూసింది.