Sheshmahal | ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ (Sheesh Mahal) పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీడబ్ల్యూడీని కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఆదేశించింది కూడా.
అయితే, ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఫలితంగా దాదాపు 27 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ‘శీష్ మహల్’ టూర్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ బంగ్లాలోకి త్వరలోనే రిపోర్టర్లను తీసుకెళ్లనున్నట్లు డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ (Parvesh Verma) సోమవారం తెలిపారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా పని చేసిన సమయంలో సివిల్ లైన్స్‌లో ఆయన అధికారిక నివాసం ఏర్పరుచుకున్నారు. అయితే, ఆ నివాసాన్ని బీజేపీ ‘శీష్ మహల్’గా అభివర్ణిస్తోంది. ఢిల్లీ సీఎం అధికార నివాసాన్ని దాదాపు రూ.80 కోట్ల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్లు ఆరోపిస్తోంది. తమ ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ఆయుధంలా వాడుకుంది. ఈ బంగ్లాను పునరుద్ధరించడంలో పెద్ద స్కామ్ జరిగిందని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. ఈ అంశం ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్లింది. ఆప్ ఓటమికి ఇది కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఈ ‘అద్దాల మేడ’లో నివాసం ఉండట్లేదు. ఈ బంగ్లాను మ్యూజియంగా మారుస్తామంటూ సీఎం రేఖా గుప్తా ఇప్పటికే ప్రకటించారు.
Also Read..
Tragedy | విషాదం.. రజస్వల కాలేదన్న బెంగతో యువతి ఆత్మహత్య