ఈ టైమ్ బాలేదు!

- దేశంలో రెండు టైమ్జోన్లకు పెరుగుతున్న డిమాండ్
- ఐఎస్‌టీతో ఈశాన్య ప్రాంతాల్లో తలెత్తుతున్న ఇబ్బందులు
- వేర్వేరు టైమ్ జోన్లతో పగటి సమయం ఆదాతో పాటు.. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించొచ్చంటున్న నిపుణులు
- వ్యూహాత్మకంగా నష్టమేనంటున్న కేంద్రప్రభుత్వం
- స్వాతంత్య్రానికి ముందు దేశంలో మూడు టైమ్ జోన్లు
- అమెరికా, రష్యాలో కొనసాగుతున్న వేర్వేరు టైమ్జోన్లు
నేషనల్ డెస్క్:టూర్లో భాగంగా హైదరాబాద్‌కు చెందిన రుద్ర.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని జీరో వ్యాలే పర్యటనకు వెళ్లాడు. దగ్గర్లోని నేచర్ స్పాట్లను ఉదయమే చూసి రావలన్నది ఆయన ప్రణాళిక. మరుసటి రోజు. ఉన్నపళంగా నిద్రలేచాడు. ‘అరరే.. అప్పుడే తెల్లారిపోయిందా?’ అంటూ హోటల్ గదిలోని గడియారం వంక చూశాడు. సమయం 3.25 గంటలు చూపిస్తున్నది. ‘ఇదేంటి.. వేకువజామున మూడింటికి సూర్యుడు ఉదయించడమేంటి?’ అని ఆశ్చర్యపోయాడు. ఈశాన్య రాష్ర్టాల్లో పగటి పూటకు, గడియారం చూపించే సమయానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసమే రుద్రను ఆశ్చర్యపోయేలా చేసింది. ఈశాన్య ప్రాంతాల్లో పగటిపూటకు, గడియార సమయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలని పేర్కొంటూ భారత్‌కు రెండు టైమ్ జోన్లు అవసరమన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నది. మిగతా రాష్ర్టాల కంటే ఈశాన్యంలో సమయం ఎందుకు భిన్నంగా ఉంటుంది? భారత్‌కు రెండు టైమ్ జోన్లు నిజంగా అవసరమా? తదితర అంశాలపై ప్రత్యేక కథనం..
ఈశాన్యంలో అయోమయ కాలం
తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యుడు ఉదయించే సమయానికి పశ్చిమంలోని గుజరాత్లో చీకట్లు కూడా తొలిగిపోవు. భూమి పశ్చిమం వైపు నుంచి తూర్పునకు తిరుగడం, ఈ రెండు ప్రాంతాల మధ్య సుమారు 2,993 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల.. ఆయా ప్రాంతాల్లో సమయంలో రెండు గంటల తేడా ఉంటుంది. అంటే అరుణాచల్‌లో సూర్యుడు ఉదయించిన రెండు గంటల తర్వాత గుజరాత్లో ఉదయిస్తాడు. అయితే గడియారంలో మాత్రం రెండు ప్రాంతాల్లో ఒకే సమయం కనిపిస్తుంది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. గడియారంలో ముళ్లు సాయంత్రం 6.30 గంటలుగా చూయించే సమయానికి.. గుజరాత్లో సూర్యుడు అస్తమిస్తుంటాడు. ఇదే సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో అప్పటికే చీకటిపడి రెండు గంటలు గడుస్తుంది (అంటే సాయంత్రం 4.30 గంటలకు అరుణాచల్‌లో సూర్యుడు అస్తమించాడన్న మాట). దీనికి ప్రధాన కారణం దేశం మొత్తానికి ఒకే కాలమానం ఉండటమే.
రెండు టైమ్ జోన్లు అందుకే!
భూమిపై నిలువుగా గీసిన రేఖాంశాలను బట్టి సమయాన్ని విభజిస్తారన్న విషయం తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చాక, 1947 సెప్టెంబర్ 1న (ఇప్పటికి 74 ఏండ్లు) దేశమంతటికీ ఒకే కాలమానం ఉండేలా ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (ఐఎస్టీ)ని తీసుకొచ్చారు. అయితే, సువిశాల భారతంలో వేర్వేరు ప్రాంతాల మధ్య వందల కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ, గడియారం చూపించే సమయాల్లో మార్పులు లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లోని ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల్లో లైట్లు వేసుకొని పని చేయాల్సి వస్తున్నది. (అప్పటికే అక్కడ సూర్యుడు అస్తమిస్తుంటాడు). అందుకే ఈశాన్య రాష్ర్టాల్లో అవసరానికి మించి విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొనే.. దేశంలో ఈశాన్యానికి, మిగతా ప్రాంతాలకు రెండు టైమ్ జోన్లు ఉండాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
లాభమేంటి?
దేశంలో వేర్వేరు టైమ్ జోన్లు ఉండటం వల్ల వివిధ ప్రాంతాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు ఎలా జరుగుతున్నాయో దాన్ని బట్టే గడియారంలో సమయం చూపిస్తుంది. వాటి ప్రకారమే ప్రజలు వారి దైనందిన జీవన సరళిని మార్చుకుంటారు. పగటి సమయం ఆదా అవుతుంది. ఆరోగ్య సమస్యలు ఉండవు. అలాగే, ప్రజల వ్యక్తిగత సమయం, ఉత్పాదకత, కార్యాలయ సమయం తదితరాలు ఆదా అవడమే గాక, విద్యుత్ వినియోగం కూడా తగ్గుతుంది.
నష్టమేంటి?
దేశంలో రెండు టైమ్ జోన్లను అమలుపర్చకపోవడానికి వ్యూహాత్మక కారణాలున్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ గతేడాది పార్లమెంట్‌కు తెలిపారు. భిన్నమైన టైమ్ జోన్లు ఉంటే రైళ్లు, విమాన టైమ్ షెడ్యూళ్లకు అంతరాయం కలుగొచ్చని, వివిధ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆఫీసులు, మీడియా మధ్య అనుసంధానం కోల్పోవచ్చని కొందరు అంటున్నారు. అయితే, అమెరికా, రష్యా, కెనడాల్లో భిన్న టైమ్జోన్లు ఉన్నప్పటికీ, ఆయా సమస్యలను అక్కడి ప్రభుత్వాలు సమర్థంగా పరిష్కరిస్తుండటం గమనార్హం.
భారత్‌కు రెండు టైమ్ జోన్లు ఉంటే ఏడాదికి సగటున 2 కోట్ల కిలోవాట్ విద్యుత్తును ఆదా చేయవచ్చని సీఎస్ఐఆర్-ఎన్పీఎల్ పరిశోధకులు అంచనా వేశారు.
ఐఎస్‌టీతో సంబంధం లేకుండా అస్సాంలోని తేయాకు కార్మికులు శీతాకాలంలో ‘చాయ్బగాన్ టైమ్’ను అనుసరిస్తారు. ప్రస్తుత ఐఎస్‌టీతో పోలిస్తే, ఈ సమయం ఒక గంట ముందుగా ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- Time Zones
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

