Rahul Gandhi | న్యూఢిల్లీ, డిసెంబర్ 28: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో శనివారం అంత్యక్రియలు నిర్వహించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. గతంలో అంత్యక్రియలకు ఇతరులకు ప్రత్యేక స్మశాన స్థలాలను ఇచ్చిన విషయాలను ఆయన ఉటంకిస్తూ.. ఇది మాజీ ప్రధాని, సిక్కు జాతిని పూర్తిగా అవమానపర్చడమేనని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. మన్మోహన్ అంత్యక్రియల విషయంలో రాజకీయాలకు, సంకుచిత భావాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించ లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ఈ సందర్భంగా 2016లో మాజీ ప్రధాని వాజపేయి అంత్యక్రియల నాటి ఫుటేజ్‌ను షేర్ చేస్తూ మన్మోహన్ సింగ్ విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు.
మన్మోహన్ అంత్యక్రియలు, స్మారక నిర్మాణ విషయంలో మోదీ ప్రభుత్వ వైఖరిని సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ, ఆప్ తీవ్రంగా ఖండించాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా శుక్రవారం స్పందిస్తూ దేశ మాజీ ప్రధాన మంత్రులను గౌరవించే సాంప్రదాయాన్ని కొనసాగించాలని ప్రధాని మోదీని కోరారు.
బతికి ఉన్నప్పుడు ఎన్నడూ మన్మోహన్ సింగ్‌ను గౌరవించని కాంగ్రెస్ ఇప్పుడు ఆయన మరణాంతరం రాజకీయాలు చేస్తున్నదని బీజేపీ సీనియర్ నేత సుధాంశు త్రివేది విమర్శించారు. మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, పీవీ నరసింహారావులు సహా గాంధీయేతర నేతలెవ్వరికీ కాంగ్రెస్ గౌరవాన్ని ఇవ్వలేదని ఆరోపించారు. బీజేపీ నేత సీఆర్ కేశవన్ మాట్లాడుతూ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కు ఢిల్లీలో అంత్యక్రియలు జరపకుండా కాంగ్రెస్ అడ్డుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ దీనిపై సమాధానం చెప్పాలన్నారు.