న్యూఢిల్లీ: నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొని జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)ను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. (Government Extends AFSPA) ఈ రెండు ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నది. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం 1958 (28 ఆఫ్ 1958) సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన అధికారాలను కేంద్ర ప్రభుత్వం వినియోగించింది. నాగాలాండ్‌లోని ఎనిమిది జిల్లాలు, మరో ఐదు జిల్లాల పరిధిలోని 21 పోలీస్ స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్‌లోని మూడు జిల్లాలను ‘డిస్టర్బ్డ్ ఏరియా’గా పేర్కొంది. 2024 ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలల వరకు అమలులో ఉన్న సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాగాలాండ్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది.
కాగా, శాంతి భద్రతలు లోపించిన ప్రాంతాలను ‘అంతరాయం కలిగించే’ ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆయా ప్రాంతాలలో పనిచేసే భద్రతా దళాలకు సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం కింద ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది. ప్రజా శాంతి నిర్వహణ కోసం సోదాలు చేసేందుకు, అరెస్టు చేసేందుకు, అవసరమైతే కాల్పులు జరిపేందుకు ఏఎఫ్ఎస్పీఏ ద్వారా విస్తృత అధికారాలు ఇస్తుంది.