Premium Trains | ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. రైల్వే మంత్రిత్వ శాఖ లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC)ను విసర్తిస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ప్రభుత్వ ఉద్యోగులు 385 ప్రీమియం ట్రైన్లలో ప్రయాణించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో వందే భారత్, హమ్సఫర్, తేజస్, రాజధాని, శతాబ్ది, దురంతో రైలు ఉన్నాయి. ప్రస్తుతం 136 వందే భారత్ రైళ్లు, 97 హమ్సఫర్, ఎనిమిది తేజస్ రైళ్లు, రాజధాని, శతాబ్ది, దురంతో వంటి 144 రైళ్లు ఉండగా.. వీటిలో ప్రయాణం చేయవచ్చని చెప్పింది. రాజధాని, శతాబ్ది, దురంతో కేటగిరీలోని 144 ప్రస్తుత రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే విలాసవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా నిర్ణయంతో దేశంలోని అన్ని జోన్లలోని 385 రైళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు ఎల్టీసీ కింద ప్రయాణానికి టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుంటుంది.
ఉద్యోగులు ఎల్టీసీ కింద స్వస్థలాలు, దేశంలోని ఏదైనా గమ్యస్థానానికి ప్రయాణం చేయొచ్చు. వందే భారత్, తేజస్, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో తక్కువ, మధ్యస్థ దూరంగా ఉండే ప్రయాణాలకు లెవల్ 11 వరకు ఉన్న ఉద్యోగులు చైర్కార్ ప్రయాణాలు చేయవచ్చు. లెవల్ 12 అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు ఈ రైళ్లలో ఎగ్జిక్యూటివ్ చైర్కార్ ప్రయాణానికి అర్హులు. లెవల్ 12, అంతకంటే ఎక్కువ స్థాయి ఉద్యోగులు సుదూర ప్రయాణాలకు ఏసీ సెకండ్ క్లాస్లో ప్రయాణం చేయవచ్చు. లెవల్ 6 నుంచి 11 వరకు ఉన్న ఉద్యోగులు ఏసీ సెకండ్ క్లాస్లో.. ఇక లెవల్ 5.. అంతకంటే తక్కువ స్థాయి ఉద్యోగులు ఏసీ థర్డ్ క్లాస్లో ప్రయాణాలు చేయొచ్చని వివరించింది. ఇదిలా ఉండగా లీవ్ ట్రావెల్ కన్సెషన్ (LTC) ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు సంవత్సరాల వ్యవధిలో దేశంలోని ఎక్కడికైనా ప్రయాణించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. ఇందులో రాయితీ ఇస్తారు. ఉద్యోగులు ప్రతి రెండేళ్లకోసారి స్వస్థలాలు, దేశంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు.