ముంబై: కొందరు గూండాలు బాలికల వెంటపడి వేధిస్తున్నారు. ఈ విషయం తెలిసిన అమ్మాయిల తండ్రి వారిని నిలదీశాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ గూండాలు బాలికల తండ్రిని హత్య చేశారు. (Goons harass girls, kills Father) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 53 ఏళ్ల నరేష్ వాల్డే తన వృద్ధ తల్లి, ముగ్గురు కుమార్తెలతో కలిసి ఇమామ్వాడ ప్రాంతంలో నివసిస్తున్నాడు. కొందరు గూండాలు అతడి కుమార్తెల వెంటపడి వేధిస్తున్నారు. ఈ విషయం తెలిసిన నరేష్ ఆ వ్యక్తులను నిలదీశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో నరేష్‌ను చంపుతామని ఆ గూండాలు హెచ్చరించారు.
కాగా, మార్చి 26న తన పనిలో బిజీగా ఉన్న నరేష్‌కు గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. జాట్ తారోడి ప్రాంతానికి రావాలని అతడికి చెప్పారు. దీంతో నరేష్ తన బైక్‌పై అక్కడకు వెళ్లాడు. పదునైన ఆయుధాలతో వేచి ఉన్న ఆ గూండాలు అతడిపై దాడి చేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు నరేష్ హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.