న్యూఢిల్లీ, జూలై 27: భారత్‌లో స్ట్రీట్‌వ్యూ సేవలను గూగుల్ మ్యాప్స్ మళ్లీ ప్రారంభించింది. దేశీయ సంస్థలైన టెక్ మహీంద్రా, మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ జెనిసిస్తో కలిసి హైదరాబాద్‌తో సహా దేశంలోని 10 నగరాల్లో ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు గూగుల్ బుధవారం ప్రకటించింది. ఆయా నగరాల్లో లక్షా 50 వేల కిలోమీటర్లు స్ట్రీట్ వ్యూలో కవర్ అయినట్టు గూగుల్ పేర్కొన్నది.
తొలి దశలో భాగంగా స్ట్రీట్ వ్యూ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పుణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్సర్ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 50కి పైగా నగరాల్లో ఈ సేవలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు గూగుల్ తెలిపింది. గూగుల్ స్ట్రీట్‌వ్యూ ద్వారా రోడ్లు, వీధులను 360 డిగ్రీల కోణంలో విశాలమైన హైక్వాలిటీ దృశ్యాలను (పనోరమిక్ ఇమేజ్‌లు)వీక్షించవచ్చు. కంప్యూటర్లో గానీ, మొబైల్లో గానీ గూగుల్ మ్యాప్స్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. కాగా, భద్రతాపరమైన కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం గతంలో ఈ స్ట్రీట్‌వ్యూ సేవలను అనుమతించలేదు.
గూగుల్ స్ట్రీట్వ్యూను ఫీచర్‌ను భారత్‌లో మొదటిసారిగా 2011లో తీసుకువచ్చింది. అయితే స్ట్రీట్‌వ్యూ పేరిట చిత్రాలు సేకరించడంపై అప్పట్లో ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఈ టెక్నాలజీ వల్ల భద్రతాపరంగా ముప్పు ఉన్నదని పేర్కొంటూ.. 2016లో నిషేధం విధించింది. ఈ సేవల వల్ల ఉగ్రవాదులు సులువుగా రక్షణశాఖకు చెందిన వివరాలను తెలుసుకునే అవకాశం కల్పిస్తుందని భావించింది.
తాజాగా స్ట్రీట్వ్యూతోపాటు మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్ సేవలను సైతం గూగుల్ తీసుకొచ్చింది. మొదటగా బెంగళూరు నుంచి ట్రాఫిక్ పోలీసుల భాగస్వామ్యంతో దీన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. కీలకమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంలో పోలీసులకు సహకారంగా ఉండే ఈ సేవలను హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు కూడా విస్తరించనున్నట్టు గూగుల్ తెలిపింది.
స్ట్రీట్‌వ్యూ ఫీచర్‌తో ఒక రోడ్డులోని వీధి ఎలా ఉంటుంది? ఆ వీధిలో ఏయే షాపులు ఉన్నాయి? లాంటి వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో స్ట్రీట్‌వ్యూ ఫీచర్ ఉపయోగిస్తే.. మ్యాప్‌లో కొత్తగా బ్లూకలర్‌లో కొన్ని చుక్కలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే ఆ ప్రాంతానికి సంబంధించిన వీధులు, దుకాణాలు, ఇండ్ల చిత్రాలను 360 డిగ్రీల కోణంలో హైక్వాలిటీలో చూడవచ్చు. ఇలా వేలాది ప్రాంతాల్లో గూగుల్ స్ట్రీట్‌వ్యూ
ఇమేజ్‌లను మ్యాప్‌లో పొందుపర్చారు.