Gennova Vaccine for Omicron | ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ కట్టడి చేయడానికి వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్లు భారత్‌లోని జెన్నోవా బయో ఫార్మా కంపెనీ తెలిపింది. వచ్చే రెండు నెలల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని వినికిడి. దీన్ని బూస్టర్ డోస్‌గా గానీ, స్వతంత్ర వ్యాక్సిన్‌గా గానీ వినియోగంలోకి తెచ్చేందుకు కొద్ది రోజుల్లోనే ట్రయల్స్ నిర్వహిస్తామని జెన్నోవా ఫార్మా అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ప్రపంచవ్యాప్తంగా వెలుగు చూస్తున్న కరోనా కేసుల్లో అత్యధికం ఒమిక్రాన్ వేరియంట్‌వే. ఇంతకుముందు కోవిడ్ నియంత్రణకు ఇదే జెన్నోవా కంపెనీ.. హెచ్‌జీసీ019 ఎంఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను తయారు చేసింది. దీనిపై తొలి, రెండో దశ ట్రయల్స్ పూర్తయ్యాయి. తొలి దశ ప్రయోగ ఫలితాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీసీఎస్‌వో)కు సమర్పించింది. వీటిని పరీక్షించిన నిపుణుల కమిటీ ప్రజల్లో రోగ నిరోధకతను పెంచడంతోపాటు సురక్షితమైందేనని నిర్ధారించింది.
ఇక రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి మూడు రోజుల క్రితం జెన్నోవా అందజేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ముగించుకుని దాని వినియోగానికి అనుమతి పొందితే దేశంలోనే తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్.. హెచ్‌జీసీ019 కానుందని సమాచారం. మహారాష్ట్రలోని పుణెలో ఈ కంపెనీ ఉంది.