Ketan Agarwal : మహారాష్ట్ర (Maharastra) లోని పుణె సిటీ (Pune City) లో కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలోపడి బిజినెస్‌మ్యాన్ (Business Man) కేతన్ విశాల్ అగర్వాల్ (Ketan Agarwal) మృతిచెందిన ఘటనకు సంబంధించిన కేసు కీలక మలుపు తిరిగింది. అది ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కేతన్‌ను అతడి కాబోయే భార్యే చంపేసినట్లు వారు అనుమానిస్తున్నారు. అందుకే అనుమానాస్పద మృతి కేసును హత్య కేసు (Murder Case) గా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. 26 ఏళ్ల కేతన్ అగర్వాల్ జూన్ 18న చారిత్రక లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చామని, కేతన్ తనను ఫొటోలు తీస్తుండగా హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని కేతన్ కాబోయే భార్య పోలీసులకు తెలిపింది. దాంతో ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
అయితే విచారణ సందర్భంగా కేతన్ కాబోయే భార్య పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. హత్య కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడిది హత్య అని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో కేతన్ కాబోయే భార్యను, ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. వాళ్లే అతడిని లోయలోకి తోసి ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉందని భావిస్తున్న మరో ఆరుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేతన్ మృతిని హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పుణె సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన కేతన్.. తన కుటుంబ స్థిరాస్తి వ్యాపార కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు. ఇటీవలే అతడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. జూన్ 19న కాబోయే భార్య పుట్టినరోజు ఉండటంతో ఆ వేడుకల కోసం కేతన్ కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లారు. అక్కడే ఈ విషాద ఘటన జరిగింది.