హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): పిల్లలకు దగ్గు, జలుబుకు సంబంధించిన సిరప్లు, ఇతర మందులు వాడుతున్నారా?.. జర జాగ్రత్త. సాధారణంగా చాలా మంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదిస్తారు. అప్పుడు డాక్టర్లు రాసిన ప్రిస్కిప్షన్‌ను భద్రంగా పెట్టుకొంటారు. ఒక ఆరు నెలల తరువాతనో లేక కొన్ని రోజుల తరువాత ఎప్పుడైనా పిల్లలకు జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తితే, గతంలో వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ ఆధారంగా సిరప్‌లను వాడటం చాలామంది తల్లిదండ్రులు చేస్తుంటారు. మరికొందరు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా సొంత నిర్ణయాలే తీసుకొంటారు. వారికి తెలిసిన లేదా ఎవరో చెప్పిన సిరప్లనో లేక మెడికల్ షాప్ వారి సూచన మేరకు పిల్లలకు సిరప్లు వాడుతుంటారు. కానీ అది చాలా ప్రమాదకరం అంటున్నారు చిన్నపిల్లల వైద్యనిపుణులు. పిల్లల ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సూచన మేరకే మందులు వాడాలని సూచిస్తున్నారు. ఆఫ్రికాలోని గాంబియా దేశంలో దగ్గు సిరప్‌తో 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో వైద్యులు చిన్నపిల్లల తల్లిదండ్రులకు పలు రకాల హెచ్చరికలు, సూచనలు చేస్తున్నారు.
సాధారణంగా ఏడాదిలోపు శిశువులకు కోల్డ్, కాఫ్ సిరప్లు అస్సలు వాడకూడదు. నాసోక్లియర్ సెలన్ నాజల్ డ్రాప్స్ వంటివి వాడాలి. పెద్దవారికి వాడే కాఫ్ సిరప్స్ పిల్లలకు వాడకూడదు. సాధారణంగా పిల్లల్లో దగ్గు వెంటనే తగ్గదు. మూడు నాలుగు రోజులు పెరిగి తరువాత క్రమంగా తగ్గుతుంది. ఫ్రీక్వెంట్‌గా నీరు ఎక్కువగా తాగిస్తే దగ్గు తగ్గుతుంది. దగ్గు దమ్ము వంటిది ఉంటే దానికి రిలేటెడ్‌గా బ్రాంకోడెలేటస్ను మాత్రమే వాడాలి. సాధారణ దగ్గు, జలుబుకు చిన్నపిల్లలకు కాఫ్ సప్రసెన్స్ వాడరు. ఈ విషయమై మన దగ్గర చిన్నపిల్లల వైద్యులకు అవగాహన ఉన్నది. పిల్లల బరువు ఆధారంగా సిరప్‌ల మోతాదును ఇస్తారు. కొంత మంది మదర్స్ పిల్లోడు ఎక్కువ దగ్గుతున్నాడని ఎక్కువ డోస్ ఇస్తారు. దాని వల్ల తీవ్ర సమస్యలు ఎదురవుతాయి. యాంటిబయాటిక్స్ కూడా ఎక్కువగా వాడొద్దు. క్రోసిన్ సిరప్ కూడా ఎక్కువగా వాడొద్దు. వైద్యులు సూచించిన మోతాదు, సమయాన్నే పాటించాలి. సొంత నిర్ణయాలు అస్సలు మంచిదికాదు. ఆహార పదార్థాలకు, నీటికి, సిరప్‌లకు ఎలాంటి సంబంధం లేదు. సిరప్లు వేయగానే ఫీడింగ్గానీ, నీరు గానీ ఇవ్వొచ్చు.
– డాక్టర్ ఉషారాణి, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్, నిలోఫర్ దవాఖాన
1980 లోనే మన దేశంలో డైఇథైలిన్ ైగ్లెకోల్, ఇథైలిన్ ైగ్లెకోల్ కాంబినేషన్‌తో తయ్యారు చేసే సిరప్‌లను నిషేధించారు. అప్పట్లో ఈ కాంబినేషన్‌తో తయారైన సిరప్‌ల వల్ల కోల్‌కతాలో మరణాలు సంభవించాయి. అప్పటి నుంచి మన దేశంలో ఆ కాంబినేషన్‌తో తయారయ్యే సిరప్‌లను నిషేధించారు. ఆఫ్రికాలో వాడిన సిరప్లు మన వద్ద ఎక్కడా లేవు. ఆ భయం అవసరం లేదు.