హైదరాబాద్ : దేశంలో నేడు అత్యంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని, దివంగత ఉక్కు మహిళ ఇందిరా గాంధీ( Indira Gandhi) బతికి ఉంటే నేడు బీజేపీ వంటి మతతత్వ పార్టీలను నిషేధించే(Banned BJP) వారని రాజస్తాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాత్ అన్నారు. జైపూర్లో జరిగిన ఒక అవార్డు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో దేశం అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందన్నారు. తన 50 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నడూ చూడనంతగా అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ పార్టీ అభివృద్ధి, సంక్షేమాన్ని వదిలిపెట్టి మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ మోసాలను గుర్తించకుంటే భవిష్యత్తులో ప్రజలే దీని పర్యవసానాలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చ రించారు. ఉద్దేశపూర్వకంగా బీజేపీ ప్రభుత్వం మతపరమైన అల్లర్లకు పాల్పడుతుందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులకు బీజేపీ ఎందుకు టికెట్లు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. హిందుత్వ మద్దతుదారులను రెచ్చగొట్టి పాలన సాగించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారి విషయంలో.. ఇందిరా గాంధీ వంటి ఉద్దండ నాయకురాలు నేడు ఉండి ఉంటే ఆమె బీజేపీపై నిషేధం విధించి ఉండేవారన్నారు.
కేవలం హిందుత్వ ఎజెండాతోనే పార్టీని నడుపుతారా? హిందువుల పేరుతోనే రాజకీయాలు చేయాల నుకుం టున్నారా? అని ఆయన ప్రశ్నించారు. అశోక్ గెహ్లాత్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ కాంగ్రెస్ హిందువుల పట్ల ద్వేషంతో ఉందని, ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది హిందుత్వం పట్ల కాంగ్రెస్కు ఉన్న ద్వేషాన్ని ఇది స్పష్టం చేస్తోందని ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.