బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి జిల్లాలో మాజీ బీజేపీ ఎమ్మెల్యే సుభాశ్ గుత్తేదార్ ఇంటి వద్ద కాలిపోయిన ఓటర్ల రికార్డుల గుట్టలు కనిపించాయి. 2023లో కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో అలంద్ నియోజకవర్గంలో ఓట్ల దొంగతనం జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు వేగవంతమైన సమయంలో ఈ సంఘటన జరిగింది.
సిట్ శుక్రవారం సుభాశ్, ఆయన కుమారులు, ఓ చార్టర్డ్ అకౌంటెంట్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించింది. ఓటర్ల రికార్డులు కాలిపోయి కనిపించడం గురించి సుభాశ్ విలేకరులతో మాట్లాడుతూ, పండుగ సమీపిస్తుండటంతో పనివారు ఇంటిని శుభ్రం చేస్తూ వాటిని కాల్చేశారని చెప్పారు. తనకు దురుద్దేశం లేదన్నారు.