Canada | న్యూఢిల్లీ: మెరిసేదంతా బంగారం కాదని మరోమారు రుజువైంది. విదేశాలకు వెళ్తున్న మనవాళ్లంతా సుఖపడిపోతున్నారని, రాజభోగాలు అనుభవిస్తున్నారని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరోటి ఉండదని తాజాగా రుజువైంది. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఉన్న తందూరి ఫ్లేమ్ రెస్టారెంట్లో వెయిటర్, సర్వర్ ఉద్యోగాలకు 3 వేల మంది భారతీయ విద్యార్థులు క్యూ కట్టడం అక్కడి దారుణ పరిస్థితులను కండ్లకు కడుతున్నది. కిలోమీటరు పొడవున్న లైనులో ఉద్యోగార్థులు నిలబడి ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
‘మేఘ్ అప్డేట్స్’ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో.. కెనడాలో చదువు, ఉద్యోగాలు కోరుకునే యువతకు ఈ వీడియో కనువిప్పు కలిగిస్తుందన్న చర్చ మొదలైంది. కొత్తగా ప్రారంభించబోయే రెస్టారెంట్ వెయిటర్, సర్వెంట్ జాబ్స్‌కు వేసిన అడ్వైర్టెజ్‌మెంట్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇదని అందులో పేర్కొన్నారు. ఎన్నో కలలతో కెనడాకు వెళ్లే భారతీయ విద్యార్థులు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ వీడియో నొక్కి చెప్తున్నది. మాంద్యం తరుముకొస్తున్న వేళ విదేశాలకు వెళ్లకపోవడమే బెటరని కొందరు సలహా ఇస్తున్నారు.