Dementia | న్యూఢిల్లీ: ‘పెండ్లి చేయండి.. పిచ్చి కుదురుతుంది’ అంటూ మన పెద్దలు చెప్పిన మాటలను వింటుంటాం. అయితే వాస్తవానికి పెండ్లి చేస్తే పిచ్చి తగ్గడం మాట దేవుడెరుగు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని, పెండ్లి కాని వారి కన్నా అయిన వారికే అది వచ్చే అవకాశం ఎక్కువ ఉందని అంటున్నారు కొందరు పరిశోధకులు! కాబట్టి పెండ్లి కాలేదనో, విడాకులు పొందామనో చింతించకండి అంటున్నారు వీరు. వివాహం కాకుండా సింగిల్‌గా ఉన్నవారు లేదా వివాహం విచ్ఛిన్నమై ఉన్న వారికి డిమెన్షియా (చిత్త వైకల్యం) వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వెల్లడించారు ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. జీవితంలో మతిభ్రంశం కలగకుండా ఉండాలంటే పెండ్లికి దూరంగా ఉండండని వీరు సలహా ఇస్తున్నారు.
అదేంటి ఇంతవరకు పెండ్లి చేసుకుంటే మంచిదంటూ దీనికి వ్యతిరేకంగా అనడాన్ని విన్నామే అంటున్నారా? అదీ నిజమే! 2019లో అమెరికాలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం వివాహితులైన వారి కంటే అవివాహితులకు చిత్తవైకల్యం వచ్చే గణనీయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు అప్పట్లో తెలిపారు. వాస్తవానికి వైవాహిక జీవితం అనంతరం వివాహితులు మంచి ఆరోగ్యంతో ఉంటారని ప్రజలు భావిస్తుంటారు. అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన పరిశోధనలు కూడా హృద్రోగాలు, స్ట్రోక్ వంటి ప్రమాదకర వ్యాధులు అవివాహితుల కన్నా వివాహితులకు తక్కువగా వస్తాయని తెలిపారు. అయితే కొత్త పరిశోధన మాత్రం వీటన్నింటి కన్నా భిన్నమైన, ఆశ్చర్యకరమైన ఫలితాలను వెలువరించింది. దానిని ఒకసారి పరిశీలిద్దాం.
ఈ పరిశోధకులు డిమెన్షియా వ్యాధి లేని 24 వేల మంది అమెరికన్లను ఎంపిక చేశారు. వీరిని 18 ఏండ్ల పాటు పరిశీలించారు. వీరిని వివాహిత, విడాకులు, వైధవ్య, ఎన్నడూ వివాహం చేసుకోని వ్యక్తుల గ్రూపులుగా విభజించారు. తొలుత వివాహితుల గ్రూప్‌తో పోలిస్తే మూడు అవివాహిత గ్రూపుల వారికి డిమెన్షియా వ్యాధి ప్రమాదం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. చిత్తవైకల్యంపై సంబంధాల ప్రభావం చాలా క్లిష్టంగా ఉంటుందని ఈ పరిశోధకులు పేర్కొన్నారు.